Delhi BRS Office : ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రేపు దిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12:37 గంటల నుంచి 12:47 గంటల మధ్య ప్రారంభోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.  అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి తన ఛాంబర్ లో కూర్చుంటారు.  దేశంలోని వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 


ఎనిమిదేళ్లలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి 
 
దిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ రేపు(బుధవారం) ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. తెలంగాణ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. మరోవైపు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు కూడా వస్తారని తెలిపారు. కేవలం ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో రైతులు, పేదల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. తాను కేసీఆర్ కు సైనికుడిగా ఉండడం చాలా ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. 


దేశం కొంత మంది గుప్పిట్లో 


తెలంగాణ మాదిరి దేశంలో ప్రాజెక్టులు కట్టి ప్రజలకు సాగు, తాగు నీరును ఎందుకు ఇవ్వలేకపోతున్నారని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికీ ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామని నిలదీశారు. ధనవంతుడు ధనవంతుడుగా ఎదుగుతూనే ఉన్నాడని అన్నారు. భారతదేశం కొంతమంది గుప్పిట్లోకి పోతోందని ఆరోపించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాలకు బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించామని మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి స్పష్టం చేశారు.






బీఆర్ఎస్ కు దిల్లీ అధికారులు షాక్ 


రేపు దిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి ఆ పార్టీ శ్రేణులు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వాటిని మున్సిపల్ అధికారులు తొలిగించారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి లేదని NDMC అధికారులు అంటున్నారు. దిల్లీలోని సర్ధార్ పటేల్ రోడ్డులో భారీగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగింపుతో పార్టీ ఆఫీస్ బోసిపోయింది.