Delhi Liquor Scam Case:

  తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉండటంతో సోదరికి మద్దతుగా నిలిచేందుకు శుక్రవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ న్యాయ నిపుణులతో కలిసి హుటాహుటీన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ తన సోదరి కవితతో భేటీ అయ్యారు. ఈడీ విచారణపై న్యాయ నిపుణులతో కేటీఆర్, కవిత పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇచ్చిన సందేశాన్ని మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ఉన్న కవితకు చేరవేశారని.. ఈడీ విచారణను ఎదుర్కోనున్న ఆమెకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందనడంతో సందేహం లేదు. కానీ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంపై ఈడీ అడిగే ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలి అనేది సవాల్ గా మారుతుంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు.


ఈడీ కస్టడీలోనే ఉన్న రామచంద్ర పిళ్లై ఆయన స్వయంగా తాను కవిత బినామీనని వాంగ్మూలం ఇచ్చారు. కానీ తన వాంగ్మూలాన్నివెనక్కి తీసుకుంటానని పిళ్లై హౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ తో సంబంధం లేకుండా ఈడీ కస్టడీలో ప్రశ్నించి అదనపు వివరాలు రాబడుతోంది. స్వయంగా కవితకు బినామీనని ఒప్పుకున్నందున ఇద్దర్నీ ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. పిళ్లై వాంగ్మూలంపై కవిత ఏం చెప్పనున్నారు, ఈడీ నోటీసులు ఇచ్చిన సెక్షన్లపై ఎలా స్పందించాలి, వాటి పరిధికి సంబంధించి పూర్తి వివరాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు కేటీఆర్, కవిత. రెండు రోజులపాటు కేటీఆర్ ఢిల్లీలో ఉండనున్నారని సమాచారం.


మహిళా బిల్లుకు మద్దతుగా కవిత ఢిల్లీకి బయలుదేరే సమయంలో ముందు ప్రగతిభవన్ కు వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా నేరుగా శంషాబాద్ కు వెళ్లిన కవిత ఢిల్లీకి చేరుకున్నారు. నేటి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో దీక్ష కొనసాగించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చే బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ కవిత దీక్ష చేశారు. కవిత చేసిన దీక్షకు సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపారు.


మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
హైదరాబాద్ కేంద్రంగానే లిక్కర్ స్కామ్ జరిగిందని మనీశ్‌ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. శుక్రవారం దిల్లీ కోర్టులో ఆప్ నేత సిసోడియాను ఈడీ అధికారులు  హాజరుపరిచారు. సిసోడియా రిమాండ్‌ రిపోర్టులో రాజకీయ, ఆర్థిక, నేరపూరిత వ్యవహారాలను ఈడీ బయటపెట్టడింది. లిక్కర్‌ స్కామ్‌ హైదరాబాద్‌ లోనే ప్లాన్ చేశారని తెలిపింది. దినేష్ అరోరాను సౌత్ గ్రూప్ హైదరాబాద్‌కు పిలిపించిందని, ఐటీసీ కోహినూర్‌లోనే కీలక చర్చలు జరిగాయని ఈడీ రిపోర్టులో పేర్కొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు, దిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఈ విషయం తెలుసని, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారని ఈడీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. తాము ఎంపిక చేసిన హోల్‌సేల్ వ్యాపారులు 12 శాతం ప్రాపిట్ మార్జిన్‌ వచ్చే విధంగా పాలసీని రూపొందించినట్లు ఈడీ తెలిపింది. ఇది ఉండాల్సిన దానికంటే ఆరు శాతం ఎక్కువ ఉందని వెల్లడించింది.