ED:  లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ల పై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈడీ రిపోర్టులో  కేసీఆర్‌ ప్రస్తావన తేలేదని..  కవిత తరఫు న్యాయవాది మోహిత్‌రావు తెలిపారు. ‘ఈడీ రిపోర్టులో ఎక్కడా కేసీఆర్‌ పేరు ప్రస్తావన లేదు. వాదనల సందర్భంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాగుంట రాఘవ వాంగ్మూలాన్ని ప్రస్తావించింది. ఆయన తన వాంగ్మూలంలో తండ్రి శ్రీనివాసులరెడ్డికి లిక్కర్‌ కేసులో ఉన్న వారిని పరిచయం చేశారంటూ వెల్లడించారు’’ అని మోహిత్‌రావు తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కవిత బెయిల్ ఇవ్వాలా లేదా అనే తీర్పును  హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ రిజర్వు చేశారు. 


నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆమె తరఫున న్యాయవాది విక్రమ్‌ చౌదరి కోర్టులో వాదనలు వినిపించారు. కవితను నిబంధనలకు విరుద్ధంగా  అరెస్టు చేశారని ఆరోపించారు. మహిళలను విచారించే విషయంలో స్పష్టతకు సీఆర్‌పీసీలోని అంశాలను లేవనెత్తుతూ అత్యున్నత న్యాయస్థానంలో  పిటిషన్‌ వేశామన్నారు. దానిపై విచారణ కొనసాగుతుండగానే ఈడీ, సీబీఐ సమన్లు ఇచ్చాయంటూ కోర్టుకు వివరించారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించగా.. తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వబోమని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ప్రకటించారన్నారు. అంతలోనే ఒక రోజు కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి, అదే రోజు సాయంత్రానికి అరెస్టు చేశారంటూ వివరించారు.  ఎమ్మెల్సీగా ఉన్న ఆమెపై తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మహిళ హక్కులను కాలరాసే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయన్నారు. మొబైల్‌ ఫోన్లు, డిజిటల్‌ ఆధారాలను ధ్వంసం చేశాయంటూ ఆరోపించారు. కేసులో అన్ని వివరాలను పరిశీలించి తక్షణమే బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. 


దర్యాప్తునకు సహకరిస్తున్నాం
విచారణ సమయంలో దర్యాప్తు సంస్థలకు ఆమె సహకారం అందిస్తున్నారన్నారు. అయితే, కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ వాదనలు వినిపించాయి. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. మద్యం కుంభకోణంలో అక్రమ సొమ్ము నేరుగా కవిత వద్దకు చేరిందని ఈడీ వాదించింది. కేసులో కవితనే కీలక సూత్రధారిగా తేల్చింది. ఇందుకు వాట్సాప్ చాట్, ఇతర ఆధారాలు ఉన్నాయని తెలిపింది.  కేసులో బుచ్చిబాబును నిందితుడిగా చేర్చకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. 


ఫోన్లు పని మనుషులకు ఇచ్చారు
కవిత తన ఫోన్లను పనిమనుషులకు ఇచ్చినట్లు.. రూ.190 కోట్ల సొత్తు చేరిందన్న ఈడీ వాదనలో ఏ మాత్రం నిజం లేదన్నారు. వీటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు ఈడీ చూపలేదన్నారు. కవిత అరెస్ట్ విషయంలో  సీబీఐ సరియైన కారణాలు చెప్పలేదని పేర్కొన్నారు. కవిత ఈడీకి ఇచ్చిన ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక పేర్కొందని ఈడీ వాదనలు వినిపించింది. సాయంత్రం సూర్యాస్తమయాని కంటే ముందే కవితను అరెస్టు చేశామని ఈడీ వాదించింది. . ఇరువర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది.