IAS Rajith Kumar: రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రజత్ కుమార్ కుమార్తె వివాహానికి సంబంధించిన ఖర్చు ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. విచారణ ఏ దశలో ఉందని జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించిందని.. ఆరు వారాల్లోగా నివేదిక అందిస్తామని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ ధర్మాసనానికి తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ కూతురు వివాహ వేడకకు రాష్ట్రంలోని ఓ ప్రైవేటు కంపెనీ భారీగా ఖర్చు పెట్టిందని, రజత్ కుమార్ కు ఆ కంపెనీకి మధ్య క్విడ్  ప్రొ కో నడిచిందని నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ ధిల్లీ హైకోర్డులో పపిటిషన్ దాఖలు చేశారు. 


అసలేం జరిగిందంటే?


గతేడాది డిసెంబర్ లో రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ తన కూతురు వివాహ వేడుకను హైదారాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. డిసెంబర్ 17వ తేదీ నుంచి 21 మధ్య జరిగిన ఈ వేడుకకు ఈవెంట్లు, డిన్నర్లు, హోటల్ రూంల ఏర్పాట్లను ఓ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులే చూసుకున్నారని, ఈవెంట్లను బుక్ చేసినట్లు, ఇన్ వాయిస్ డేటా ఆధారాలతో మీడియాలో వచ్చింది. తాజ్ హోటల్ గ్రూపునకు బిగ్ వేవ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బిల్లులు చెల్లించిందని, ఇదో మిస్టరీ కంపెనీ అని అనుమానాలు వ్యక్తం చేసింది. కాంట్రాక్ట్‌ కంపెనీకి చెందిన వివిధ సంస్థల డైరెక్టర్లే ఇందులో ఉన్నారని అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లు, బిల్లులతో ఆ కంపెనీకి సంబంధం ఉందని బయట పెట్టింది. 


ఒక్కో ప్లేటు భోజనానికి 16, 520 రూపాయలు..


స్వయంగా రజత్ కుమార్, ఆయన ఓఎస్డీ ప్రభాకర రావు ఇద్దరూ ఆ కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులతో కలిసి ఇదంతా కో ఆర్టినేట్ చేసినట్లు తెలిపింది. పెళ్లికి ఐదు నెలల ముందే హోటళ్లలో రూములు బుక్ చేశారని, నిరుడు జులై 31న బుకింగ్స్ కోసం హోటళ్లకు మెయిల్స్ వెళ్లాయని వివరించింది. అంతకు ఒక నెల ముందు అంటే జులై1వ తేదీన బిగ్ వేవ్ ఇన్ ఫ్రా కంపెనీని ఏర్పాటు చేశారని ది న్యూస్ మినిట్ వివరించింది. కంపెనీ అడ్రస్ ను పట్టుకొని తాము వెతకగా.. అక్కడ ఎలాంటి కంపెనీ లేనట్లు తేలిందని పేర్కొంది. డిసెంబర్ 20వ తేదీన ఫలక్ నుమా ప్యాలెస్ లో 70 మంది అతిథులకు రజత్ కుమార్ ఖరీదైన విందు ఇచ్చారు. ఒక్కో ప్లేట్ కు రూ.16,520 చొప్పున బిల్లింగ్ అయిందని చెప్పుకొచ్చింది. 


అయితే వీటిలో ఎలాంటి నిజం లేదని తన కూతురు పెళ్లికి తానే ఏర్పాట్లు చేసుకున్నాని రజత్ కుమార్ వివరణ ఇచ్చారు. కంపెనీకి, ఆ పెళ్లికి ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తులుగా ఎవరైనా సహకరిస్తే అది కంపెనీకి అంటగట్టడం సరైనది కాదని సదరు కాంట్రాక్ట్ కంపెనీ తెలిపింది.