Telangana Budget 2023 :  తెలంగాణ  బడ్జెట్‌ను ఆరో తేదీన సభలో పెట్టాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న  జ‌రిగిన సమావేశంలో  6న రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించారు. 8న బ‌డ్జెట్‌, ప‌ద్దుల‌పై చ‌ర్చించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై శ‌నివారం అసెంబ్లీలో చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. ఈ నెల 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు ప్ర‌క‌టించారు. ఈనెల 12 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఎనిమిదో తేదీన మరోసారి బీఏసీ సమావేశం అయి తదుపరి ఎజెండాను ఖరారు చేయనున్నారు. 


రూ. 3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం 
  
బడ్జెట్‌ను ఆమోదించేందుకు ఈ నెల 5న ఉదయం 10.30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీ బడ్జెట్  పై చర్చించి, కేబినెట్ ఆమోదం తెలపనున్నారు. దీంతో పాటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో 6వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో భారీ బడ్జెట్ తో రాబోతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. దాదాపుగా 3లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.  


ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం 


ఉదయం అసెంబ్లీలో గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ నమస్కరించి గవర్నర్ తమిళిసైకి స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని ఆమె యథాతథంగా చదివారు.


తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్న గవర్నర్ 


తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత, ప్రజాప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిందని తెలిపారు. గ్రామాల్లో ఇంటింటికి ఉచిత తాగునీటి సరఫరా జరుగుతోందని అన్నారు. ఒకప్పుడు పాడుబడిన తెలంగాణ గ్రామాలు ఇప్పుడు కళకళలాడుతున్నాయని హార్షం వ్యక్తం చేశారు. 


ప్రభుత్వం ఇచ్చిన  ప్రసంగాన్ని యథాతథంగా చదివిన గవర్నర్ 


పంట పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుబీమా పథకం ద్వారా రూ.5 లక్షలు అందిస్తున్నామని, రైతులు పండించిన ప్రతిగింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిపై దేశవ్యాప్త చర్చ జరుగుతోందన్నారు. 2020-21 నాటికి 2,126 యూనిట్లకు తలసరి విద్యుత్ వినియోగం పెరిగిందని చెప్పారు. చరిత్రలో తొలిసారి దళితబంధుతో రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తున్నామన్నారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు 17కు పెంచామని, మరో 9 ఏర్పాటు చేస్తామన్నారు. పెన్షన్ దారుల వయోపరిమితి 57 ఏళ్లకు తగ్గించామని, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. మరోవైపు కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని ప్రస్తావించారు. దాదాపు 40 నిమిషాల పాటు ప్రసంగించిన గవర్నర్ తమిళిసై దాశరథి గేయంతో ముగించారు.