దసరా పండుగ వచ్చేస్తోంది. పిల్లలకు సెలవులిచ్చేశారు. సరదాగా ఊరెళ్దామనుకుంటే రైళ్లు, బస్సులన్నింటిలోనూ రద్దీ నెలకొంది. ఇప్పుడు ఎలా.? అనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 620 ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు తెలిపింది.
ఈ ప్రాంతాల నుంచి
పండుగల సీజన్, సెలవులు, రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైదరాబాద్ సహా కాచిగూడ, లింగంపల్లి ఇలా ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య దాదాపు 200 ట్రిప్పులు షెడ్యూల్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి కోసం కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. షిర్డీ, జైపూర్, రామేశ్వరం ఇలా రద్దీ ప్రాంతాలకు ద.మ రైల్వే రైళ్లను నడుపుతోంది.
ఈ రూట్స్ లోనే రద్దీ
సాధారణంగా పండుగల సీజన్ లో విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి, విశాఖ సహా వివిధ ప్రాంతాలకు ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువ మంది ప్రయాణిస్తారని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా రైళ్లను నడపనున్నారు. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు దాదాపు 100 సర్వీసులు అదనంగా నడపనున్నట్లు తెలిపారు.
'భారత్ గౌరవ్ టూరిస్ట్' రైళ్లు
పండుగల సందర్భంగా పుణ్య క్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే 'భారత్ గౌరవ్ టూరిస్ట్' రైళ్లను ప్రవేశ పెట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో 2 భారత్ గౌరవ్ రైళ్లు కాశీ, అయోధ్య, పూరీ వంటి పవిత్ర స్థలాలకు నడపనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం అదనపు టికెట్ కౌంటర్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు.
టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
మరోవైపు, పండుగల సందర్భంగా టీఎస్ఆర్టీసీ సైతం అక్టోబర్ 13 నుంచి 5,265 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 25 వరకూ ఇవి అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. వీటిల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. రద్దీ ఎక్కువైతే అవసరాన్ని బట్టి మరిన్ని అదనపు సర్వీసులు నడుపుతామని స్పష్టం చేశారు. తెలంగాణ నలుమూలలతో పాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.
ముందస్తు రిజర్వేషన్ ఇలా
ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.inలో చేసుకోవాలని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. గత దసరా కంటే ఈసారి 1000 అదనపు బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు.