Dasabdi Daga: దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. 'దశాబ్ది దగ' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. రోడ్లపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు చేస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచన మేరకు ఏఐసీసీ ఇన్ఛార్జి మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ కాంగ్రెస్ నేతృత్వంలో 'దశాబ్ది దగా' పేరుతో నిరసనలు తెలపాలని నిర్ణయించింది. దీంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రావణాసురుడిలా కేసీఆర్ దిష్టి బొమ్మను తయారు చేసి పది తలలు అమర్చి ప్రభుత్వ వైఫల్యాలను తలలపై రాసి వాటిని దహనం చేస్తున్నారు. రాష్ట్ర పాలన గాలికొదిలేసి, ప్రజాధనంతో పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులను పలు చోట్ల పోలీసులు అడ్డుకుని అరెస్టు చేస్తున్నారు. పలువురు ముఖ్య నేతలను ఇప్పటికే హౌజ్ అరెస్టు చేశారు. 


ప్రజాధనం దుర్వినియోగం దశాబ్ది దగానే: రేవంత్ రెడ్డి


రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కేసీఆర్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇది కచ్చితంగా దశాబ్ది దగానేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీనైనా పూర్తిగా అమలు చేశారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తమకు ఉందని అన్నారు. ముందస్తు అరెస్టులు చేసిన కాంగ్రెస్ నేతలను వెంటనే విడుదల చేయాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని రేవంత్ రెడ్డి అన్నారు. 


' తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ ఉత్సవాలు కేవలం తన కుటుంబం కోసమే జరుపుతున్నట్లుగా ఉంది. తప్పును నిలదీస్తే తప్పుడు అరెస్టులు చేస్తారా? రాష్ట్రంలో ఓ ప్రతి పక్ష పార్టీగా.. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మాకు ఉంది. ఇవి దశాబ్ది ఉత్సవాలు కావు. దశాబ్ది దగా' అని రేవంత్ రెడ్డి తన ప్రకటనలో విమర్శించారు.


ప్రజల హక్కులను కాలరాసేలా కేసీఆర్ ప్రవర్తన: కోమటిరెడ్డి


ప్రజల హక్కులను కాలరాసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీకి నిరసనలు చేసే హక్కు ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులను అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెబుతామని ఆయన విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను, పార్టీ శ్రేణులను విడుదల చేయాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.


Also Read: Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఒకే రోజు ఐదు హత్యలు- రెచ్చిపోయిన సైకో కిల్లర్‌ - గంటల వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు!


రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, అరెస్టులు


దశాబ్ది దగా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోంది. పలు చోట్ల ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ లో షబ్బీర్ అలీని గృహనిర్బంధించారు. విజయా రెడ్డిని, ఎల్బీ నగర్ లో మల్ రెడ్డి రంగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చౌటుప్పల్, కరీంనగర్, కోదాడ, హుజూరాబాద్, హుస్నాబాద్ లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయగా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.






Join Us on Telegram: https://t.me/abpdesamofficial