Revanth Reddy Counters to KCR: తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యలను ఉటంకిండంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) కౌంటర్ వేశారు. రాజకీయ అవసరాల కోసం కేసీఆర్‌ ఏదైనా మాట్లాడతారని విమర్శించారు. అసలు తెలంగాణలో భూముల ధరలు పెరగడానికి, కేసీఆర్‌ ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. భూముల ధరలు పెరిగితే భూ నిర్వాసితులకు ఆ పెరిగిన ధర కట్టి పరిహారంగా ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణను, ముఖ్యంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని కూడా చంద్రబాబు అన్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుర్తు చేశారు. మరి ఆ విషయాన్ని కూడా కేసీఆర్‌ ఒప్పుకుంటారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.


సీఎం కేసీఆర్ పటాన్ చెరులో మాట్లాడుతూ.. తెలంగాణలో ఎకరం భూమి అమ్మి ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు భూమి కొంటున్నారని అన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు (Chandrababu) అన్న ఆ మాటలను ఇప్పుడు కేసీఆర్ ఉటంకించారు. ఏపీలో సీఎం జగన్ వల్ల సంపద నాశనం అయిపోయిందని, భూముల రేట్లు పడిపోయాయని ఇటీవల చంద్రబాబు ఓ రోడ్ షోలో అన్నారు. గతంలో ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో పదుల సంఖ్యలో ఎకరాలు కొనేవాళ్లని, జగన్ వచ్చాక పరిస్థితి తారుమారైందని విమర్శించారు. తాజాగా చంద్రబాబు మాటలను పటాన్ చెరు పర్యటనలో భాగంగా కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందనడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. పటిష్ఠ నాయకుడు, నాయకత్వం ఉంటే అన్నీ సాధ్యమవుతాయని కేసీఆర్ అన్నారు.


కాంగ్రెస్ నేతల అరెస్టులపైనా స్పందన


మరోవైపు, నేడు (జూన్ 22) రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడంపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందించారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు అప్రజాస్వామికమని అన్నారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తూ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. సీఎం కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాల పేరుతో పార్టీ ప్రచారం చేసుకుంటున్నారని, అనవసరంగా ప్రజాధనాన్ని నిరుపయోగం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఏ పని ప్రారంభించినా అవినీతి తాండవిస్తుందని అన్నారు. అమరవీరుల స్తూపం నిర్మాణంలో కూడా బాగా అవినీతి జరిగిందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలు చేశారు.


సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక హామీ అయినా పూర్తిగా అమలు చేశారా? అని నిలదీశారు. సీఎం కేసీఆర్ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన హామీలనే తాము అడుగుతున్నామని తెలిపారు. ఇక ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై పోరాడే హక్కు తనకు ఉందని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల్ని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని ఆపలేరన్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక తాము ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial