దళిత బంధు కార్యక్రమం కేవలం ఎన్నికల కోసమే ప్రవేశపెట్టారంటూ విపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి సమాధానం ఇచ్చారు. దళిత బంధు పథకం అనేది ఆరునూరైనా ఆగబోదని, ఎవరు ఆపుతారో తానూ కూడా చూస్తానని తేల్చి చెప్పారు. అబద్ధాలు చెప్పే అవసరం తనకు లేదని, తనను చంపినాసరే మోసం చేసేది లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక్కసారి చెబితే అది కచ్చితంగా జరిగి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇటీవల తెలంగాణ బీజేపీకి రాజీనామా చేసిన మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదే సమయంలో పెద్దిరెడ్డి అనుచరులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ దళిత బంధు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రణాళిక ఇలా..
రాష్ట్ర ఆర్థిక పరిమితులు సహా నిధుల లభ్యతను బట్టి ఏడాదికి 2 నుంచి నాలుగు లక్షల దళిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఈ పథకం కోసం రూ.లక్ష కోట్లైనా సరే ఖర్చు పెడతామని ప్రకటించానని గుర్తు చేశారు. కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు తెలంగాణ సరైన దారికి చేరుతోందని, ఈ క్రమం ఇలాగే కొనసాగుతుందని సీఎం హామీ ఇచ్చారు.
ఏదైనా ఏనుగు ఓ దారి గుండా వెళ్తుంటే చుట్టుపక్కల చిన్నచిన్న జంతువులు అరుస్తుంటాయని, అయినా తాను పట్టించుకోబోనని కేసీఆర్ కొట్టిపారేశారు. ఇలాంటి చిల్లర అరుపులను పట్టించుకోబోమని అన్నారు. దళితబంధు అంటే బాంబు పడినట్లుగా ప్రతిపక్షాలు భయపడుతున్నాయని తెలిపారు.
గతేడాదే రావాల్సింది
‘‘ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలన్నీ ఎవరూ అడిగినవి కావు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం అన్నీ ఆలోచించి అన్నింటిని సమకూరుస్తోంది. అలాగే దళిత బంధు ఆలోచన కూడా వచ్చింది. నిజానికి గతేడాదే దాన్ని అమలు చేయాల్సి ఉంది. కరోనా వల్ల ఆలస్యమైంది. బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు ఈ పథకం కోసం కేటాయించాం. గారడీ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వచ్చి, దాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడాలి.’’ అని కేసీఆర్ అన్నారు.
ఎమ్మెల్యేల జీతాలు ఆపి నిధులిస్తున్నాం
‘‘ఎమ్మెల్యేల జీతాలు ఆపి పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నాం. రైతు బంధు, రైతుబీమా చేపట్టడానికి సంవత్సర కాలం పట్టింది. ఇప్పుడు రైతు కుటుంబాలకు వారం, పది రోజుల్లోనే బీమా సొమ్ము వస్తోంది. ఇదే తరహాలో చేనేత కార్మికులకు బీమా కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే వారికీ వస్తుంది.’’ అని కేసీఆర్ అన్నారు.
https://twitter.com/trspartyonline/status/1421132721716228098