Dalit Lawyer Attack: బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని ఊరికే అనలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. నడిరోడ్డుపై దళిత న్యాయవాది కారు అద్దాలు పగలగొట్టి.. రక్తమోడేలా దాడి చేసి.. చంపేస్తామంటూ బెదిరించడం బందిపోట్లకే సాధ్యమని పేర్కొన్నారు. దళితబంధు అక్రమాలను ఎత్తిచూపిన అడ్వకేట్ యుగేందర్ మీద బీఆర్ఎస్ గూండాల దాడిని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. దళితులపై జరుగుతున్న అన్యాయంపై, దళితుల న్యాయమైన హక్కుల కోసం వైఎస్ఆర్టీపీ పోరాడుతుందని వెల్లడించారు.
బందిపోట్ల రాష్ట్ర సమితి అంటే హుటాహుటిన కేసు నమోదు చేయించిన కేసీఆర్.. దళిత న్యాయవాదిపై దాడికి దిగిన బీఆర్ఎస్ నాయకులకు మాత్రం గొడుగు పడుతున్నారని దుయ్యబట్టారు. దళిత ముఖ్యమంత్రి నుంచి దళితబంధు వరకు అన్ని రకాలుగా మోసం చేసిన మోసగాడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ సొంత రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు పోరాడే హక్కు లేదని.. మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, ! బందిపోట్ల దాష్టీకాలకు అడ్డూఅదుపూ లేదు. అందుకే టీఆర్ఎస్ అంటే తాలిబన్ల రాష్ట్ర సమితి అని.. బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని.. అంటున్నాం' అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
తుంగతుర్తిలో దళిత న్యాయవాదిపై దాడి!
సామాజిక కార్యకర్త, న్యాయవాది పర్రెపాటి యుగంధర్ పై నిన్న శనివారం దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో యుగంధర్ తీవ్రంగా గాయపడగా.. ఆయనను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. యుగంధర్ పై దాడిని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. నల్గొండ జిల్లా తుంగతుర్తిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు దాడి చేశారని యుగంధర్ పేర్కొన్నారు. తనపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు. తన కారుకు వాహనాలు అడ్డుగా పెట్టి.. తన కారు అద్దాలు పగులగొట్టారని, కారు నుండి బయటకు ఈడ్చి ఇనుప సీకులతో, కర్రలతో దాడి చేశారని ఆరోపించారు. చనిపోయాననుకుని వదిలి వెళ్లారని యుగంధర్ తెలిపారు. ప్రస్తుతం యుగంధర్ మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దాడి విషయం తెలియగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యుగంధర్ కు ఫోన్ చేసి పరామర్శించారు. దాడి జరిగిన తీరు గుర్తించి రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పీసీసీ చీఫ్ భరోసా ఇచ్చారు. తుంగతుర్తి ప్రాంతంలో జరుగుతున్న ఇసుక రవాణాపై గత కొంతకాలంగా యుగంధర్ పోరాటం చేస్తున్నారు. పర్రెపాటి యుగంధర్ పై దాడికి పాల్పడింది తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మద్దతుదారులేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇసుక మాఫియా, రెండు పడక గదుల ఇళ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాల హామీలపై యుగంధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు.