Dalit Bandhu Scheme: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అన్ని వర్గాల అభివృద్ధి కావాలంటే పేదల జీవితాలు మెరుగుపడాలని కలలు కన్నారని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆ దిశగానే తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్ చేసిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమాన్ని అనుసంధానం చేసుకొని దేశానికే తలమానికంగా మారమని పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా దళిత జాతి ఇంకా అణగారిన వర్గంగానే ఉందన్నారు. గత పాలకులు తీసుకొచ్చిన పథకాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వాలేదన్నారు. రాజ్యాంగం అందించిన రిజర్వేషన్‌తో కొంతమంది విద్యను, ఉపాధిని పొందగలుగుతున్నా.. ఇంకా దళిత వాడలు పేదరికానికి ఆనవాళ్లుగానే ఉన్నాయని గుర్తు చేశారు. మిగిలిపోయిన మెజార్టీ దళిత జనానికి చేదోడుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
దళితుల అభి వృద్ధి మా ధ్యేయం..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితుల అభి వృద్ధి, సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు హరీష్ రావు. షెడ్యూల్ కులాలు, తెగల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి మించి నిధులు కేటాయిస్తున్న సంగతి వివరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఆ నిధులను తర్వాత ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దళితులకు కేటాయించిన నిధులు ఎక్కడ ఎలా ఖర్చు చేశామో ప్రతి సభ్యుడికి ఇచ్చామన్నారు.
అది పథకం కాదు, దళితుల ఆత్మ గౌరవం..
ఎన్ని చేస్తున్నప్పటికీ దళితుల ప్రగతి ఇంకా చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్‌రావు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తితో దళిత జాతి ప్రగతి కోసం దళిత బంధు అనే విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు హరీష్. దళిత జాతి అనుభవిస్తున్న పేదరికాన్ని అందమొందించే ఆయుధంగా తెలంగాణ దళిత బంధు ఉపయోగపడుతుందన్నారు. దళిత బందు కేవలం పథకమే కాదన్న హరీష్, వారి ఆత్మగౌరవమని, అభివృద్ధికి దిక్సూచిగా అభివర్ణించారు. గత ప్రభుత్వాలు దళితుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను బ్యాంకు లింకేజీలు, కొలాటరల్ సెక్యూరిటీలతో ముడి పెట్టడం వల్ల ఆశించిన ప్రయోజనం దక్కలేదగన్న హరీష్, ఎలాంటి ఆటంకాల్లేకుండానే నేరుగా పది లక్షలను వారి అంకౌట్లలో వేస్తున్నామన్నారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం కూడా లేదన్నారు.
దళిత బంధుకు నిధులు..
దళిత బంధు పథకం ద్వారా మార్చి నెలాఖరు నాటికి 4వేల కోట్ల రూపాయలతో దాదాపు 40వేల కుటుంబాలకు లబ్ధి చేకూరబోతుందన్నారు హరీష్. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్, చారగొండ మండలాల్లో ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేస్తోందని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11, 800 కుటుంబాలను దళిత బంధు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణించింది. దశళ వారీగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు దళిత బంధు ప్రయోజనాలు అందివ్వడం ప్రభుత్వ లక్ష్యం. 2022-23 వార్షిక బడ్జెట్‌లో దళిత బంధు పథకం కోసం 17, 700 కోట్ల రూపాయలను హరీష్ రావు ప్రతిపాదించారు.
దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ఏదైనా ఆపదకు గురైనప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా దిగజారిపోకుండా దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకంలో రిజర్వేషన్ తీసుకొచ్చి దళితులకు ప్రాధాన్యత ఇచ్చామంది ప్రభుత్వం. ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకునే వైన్‌షాపులు, బార్‌షాపులు, వివిధ రకాల కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్ ప్రభుత్వం అమలు చేస్తోందని బడ్జెట్ ప్రసంగంలో హరీష్ రావు వివరించారు.