Weather Updates: దక్షిణ అండమాన్‌, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారి, ఆపై తుపానుగా రూపం దాల్చింది. అసని తుపాను తీవ్రరూపం దాల్చడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ తుపాను వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతానికి దగ్గర్లో, పోర్ట్ బ్లెయిర్‌కు పశ్చిమ, ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో ఉంది. క్రమంగా వాయువ్యంగా కదులుతూ మే 10 రాత్రికి ఉత్తరకోస్తాంధ్ర, ఒడిశా తీరానికి సమీపానికి చేరనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం, తుపాను (Cyclone Asani) ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో తేలికపాటి జల్లుల నుంచి భారీ వర్షాలు (Light to Moderate Rain or Thundershowers) కురవనున్నాయి. తుపాను కారణంగా వాతావరణ శాఖ ఏపీలో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.


ఏపీలో చల్లచల్లగా.. వర్షాలే వర్షాలు
అల్పపీడనం, అసని తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మే 12 వరకు వర్ష సూచన ఉండగా.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముంద్రంలో చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని అధికారులు సూచించారు.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు..
అసని తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. మరో మూడు రోజులపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మరోవైపు వర్షాల నేపథ్యంలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఎండల తీవ్రత తగ్గనుందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా తుపానుకు అసని పేరును శ్రీలంక దేశం సూచించింది. సింహళం భాషలో అసని అంటే ప్రకోపం అని, ప్రతీకారం లేదా శిక్షించడం అనే అర్థం వస్తుంది.


తెలంగాణలోనూ ఓ మోస్తరు వర్షాలు..
తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని నగరవాసులకు ఎండల నుంచి ఉపశమనం కలగనుంది. మహారాష్ట్రలోని విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉండటంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వానల నుంచి భారీ వర్షాలు కురనున్నాయి. రాగల 12 గంటల్లో అసని తుఫాను మరింత తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది.


Also Read: Cyclone Asani: ఏపీలో అసని తుపాను ప్రభావంతో మారిపోయిన వాతావరణం- సముద్రంలోనే బలహీనపడే ఛాన్స్ 


Also Read: Gold-Silver Price: నేడు బంగారం కొందామనుకుంటున్నారా? ఇవాల్టి పసిడి, వెండి రేట్లు ఇవిగో!