Cyberabad Police Warn To Motorists on Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై (Cable Bridge) వెళ్లే వాహనదారులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాన్ని నిలిపితే రూ.1000 ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. కొంత మంది వాహనదారులు బ్రిడ్జి మధ్యలో వాహనాలు ఆపి సెల్ఫీలు, ఫోటోలు దిగుతున్న క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ఆదివారం వంతెనపై వాహనాన్ని నిలిపి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే కేబుల్ వంతెనపై వాహనదారులు నిబంధనలు పాటించాలని.. బ్రిడ్జిపై ప్రమాదాలు పూర్తిగా నివారించేలా సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు. బర్త్ డే వేడుకలకు సైతం కేబుల్ బ్రిడ్జిపై అనుమతి లేదని స్పష్టం చేశారు. తీగల వంతెనను వీక్షించాలనుకునే వారు ఇనార్బిట్ మాల్ వద్ద వాహనాలు నిలిపి.. ఫుట్ పాత్ మీదుగా వంతెన వద్దకు వచ్చి వీక్షించవచ్చని తెలిపారు. 


హిట్ అండ్ రన్


కాగా, నగరంలో కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన నుంచి దుర్గం చెరువు అందాలు వీక్షించేందుకు నగరవాసులు వంతెన వద్దకు పోటెత్తారు. నిత్యం రద్దీగా ఉండే ఈ బ్రిడ్జిపై నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు తొలి నుంచీ హెచ్చరిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కొందరు సందర్శకులు నిర్దేశించిన ఫుట్ పాత్ పై కాకుండా.. వంతెనపై వాహనాలు వెళ్లే రహదారికి ఇరు వైపులా ఫోటోలు దిగేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా, ఆదివారం కేబుల్ బ్రిడ్జిపై అర్ధరాత్రి సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను ఓ కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ కుమార్ అనే వ్యక్తి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులు ఏపీకి చెందిన వారిగా మాదాపూర్ పోలీసులు గుర్తించారు. ప్రమాద స్థలంలో దొరికిన వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు కారు యజమానిని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Hyderabad Metro News: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్, మెట్రోల్ రైలు ఆఫర్లు మరో 6 నెలలు పొడిగింపు