Hyderabad Metro Rail extends offers and discounts on Holiday Card: హైదరాబాద్ లో మెట్రోలో ప్రయాణించే వారికి శుభవార్త. ఇటీవల రద్దు చేసిన అన్ని ఆఫర్లను ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థ పునరుద్ధరించింది. మార్చి 31తో హాలిడే కార్డు ఆఫర్ ముగిసింది. తాజాగా ఉగాది పండుగ సందర్భంగా హాలిడే కార్డు, పీక్ అవర్స్‌లో రాయితీ ఛార్జీ ఆఫర్లను 6 నెలలపాటు మెట్రో రైలు నిర్వహణ సంస్థ అధికారులు పొడిగించారు. తాజా నిర్ణయంతో ఇకనుంచి రూ.59 హాలిడే కార్డు ఆఫర్ మళ్లీ అందుబాటులోకి రానుంది. దాంతో పాటు పీక్ అవర్స్‌లో 10 శాతం రాయితీ లభించే మెట్రో సువర్ణ ఆఫర్‌ను సైతం కొనసాగించాలని నిర్ణయించారు.
హాలిడే కార్డు ఆఫర్‌తో పాటు పీక్ అవర్స్‌లో 10 శాతం రాయితీ అందించే ఆఫర్ ఇటీవల ముగిసింది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో, ఎల్ అండ్ టీ సంస్థ అధికారులు ఇటీవల తెలిపారు. హాలిడే కార్డ్ ఆఫర్ ద్వారా ఏడాదిలో నిర్ణయించిన 100 సెలవు రోజుల్లో రూ.59తో హాలిడే కార్డు రీఛార్జ్ చేయించి, అన్ లిమిటెడ్ జర్నీ చేయవచ్చు. హాలిడే కార్డు ఉన్నవారు ఒక్క రీఛార్జ్ చేసుకుని సెలవు రోజుల్లో హైదరాబాద్ లోని 57 మెట్రో స్టేషన్ల పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడివరకైనా, ఎంత సమయం అయినా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు.