CPI Kunamneni Sambasiva Rao: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, ఆ పార్టీతో కలిసి పనిచేయడానికి తాము రెడీగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలుపులు మూసుకొని కూర్చుంటున్నారని విమర్శించారు. రెండు కమ్యూనిస్టు పార్టీలు బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నప్పటికీ కేసీఆర్ దానికి రెడీగా లేరని అనిపిస్తుందని అన్నారు. ఒకవేళ బీఅర్ఎస్ పార్టీ కలిసి రాకపోతే తామే ఒంటరిగా పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కూనమనేని ఈ వ్యాఖ్యలు చేశారు.


Also Read: e Garuda Ticket Price: HYD-VJA ఈ-గరుడ బస్‌ టికెట్ రేట్లు తగ్గింపు, నెల మాత్రమే ఈ ఆఫర్


కర్ణాటక ఎన్నికలతో బీజేపీ గుణ పాఠం - కూనమనేని


బీఆర్ఎస్ ముందుకు రాకపోతే తామే ఒంటరిగా పోటీ చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని చెప్పారు. తలుపులు బిగించుకుని కూర్చునే బదులు ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కర్ణాటక ఎన్నికలతో బీజేపీకి గుణపాఠం వచ్చిందని, బీజేపీకి వ్యతిరేకంగా నడిచే ఏ పార్టీ ముందుకు వచ్చినా, తాము మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా మూడో కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యం అని కూనమనేని సాంబశివరావు చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలను కూడా రాజకీయ పార్టీలు మానుకోవాలని సూచించారు.


కేసీఆర్ పాలన బాగుంది కానీ.. - కూనమనేని


మే 16న కూనమనేని సాంబశివరావు (CPI Kunamneni Sambasiva Rao) భద్రాచలంలో (Bhadrachalam) మీడియాతో మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మతతత్వ సిద్ధాంతాలతో ప్రజలను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని గద్దె దించడానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. అలాంటి వారికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని సాంబశివరావు వెల్లడించారు. మతం వేరు, విశ్వాసం వేరని కర్ణాటక ప్రజలు చాటిచెప్పారని అన్నారు. కర్ణాటక తరహాలోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన బాగున్నప్పటికీ ఆ మంచిని ప్రచారం చేసుకునేందుకు, ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. 


యాదాద్రి తరహాలోనే భద్రాద్రిని అభివృద్ధి చేయాలి


రాష్ట్రంలో పోడు భూములు, ఆర్టీసీ కార్మికుల సమస్యలు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తదితర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కూనమనేని డిమాండ్‌ చేశారు. యాద్రాద్రి తరహాలో భద్రాద్రిని రూ.100 కోట్లతో అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్తగూడెం వేదికగా వచ్చేనెల 4న జరిగే ప్రజాగర్జన బహిరంగ సభ ఉంటుందని కూనమనేని సాంబశివరావు చెప్పారు. ఆ సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ బలాన్ని చాటాలని పిలుపు ఇచ్చారు.


Also Read: తెలంగాణలో ఎన్నికలకు 5 నెలలే టైం, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే సెంచరీ దాటేస్తాం - కేసీఆర్ కీలక వ్యాఖ్యలు