Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శలు చేశారు. ఈ లిక్కర్ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఈ కేసులో బీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ నేతలు కూడా ఉన్నారని.. వారిని బయటే ఎందుకు ఉంచారని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలది అండర్ స్టాండింగ్‌తో కూడి‌న ముద్దులాట, గుద్దులాట మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఈ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలుకు వెళ్లకపోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ కి మధ్య ఉన్న సంబంధమే కారణమని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టే కల్వకుంట్ల కవిత అరెస్టు అవ్వలేదని అన్నారు.


నిజామాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందిస్తూ.. ఆ మాటలు ఆయన దిగజారుడుతనానికి పరాకాష్ఠ అని అన్నారు. సీఎం కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను ప్రధాని మోదీ బయట పెట్టడం అనైతిక పని అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని చెప్పేందుకే మోదీ తాపత్రయం పడుతున్నారని.. ప్రధాని స్థాయి వ్యక్తి దేశానికి అవమానకరంగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతిపై మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జాతీయ స్థాయి తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్, వామపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడితే బాగుంటుందని అన్నారు. ఏపీలోనూ టీడీపీ, జనసేనతో కలసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తామని నారాయణ చెప్పారు. ఏపీలో ఎన్నికలు చాలా దూరం ఉన్నాయని.. తమ మా పార్టీకి సంబంధించి అక్కడ పొత్తులపై ఇప్పుడేం ఆలోచించలేదని నారాయణ తెలిపారు.


కేసీఆర్ ఎన్డీఏలో కలుస్తారన్న విషయాన్ని మోదీ ఇప్పుడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. ప్రధాని ఇంత దిగజారి మాట్లాడతారని అనుకోలేదని అన్నారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదంటే మోదీని ఎలా నమ్మలేదో.. కేసీఆర్‌ను కూడా అలానే అనుమానించాల్సి ఉంటుందని నారాయణ చెప్పారు.


నిశ్చితార్థం దాకే పొత్తులు
పసుపు బోర్డు గురించి మాట్లాడుతూ.. పసుపు బోర్డు ప్రకటన చనిపోయే ముందు తులసి తీర్థం పోసినట్లు ఉందని అన్నారు. ఎన్నికలకు ముందు పసుపు బోర్డు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో నిజమైన కూటమి అంటే బీజేపీ - బీఆర్ఎస్ - ఏఐఎంఐఎం అని అన్నారు. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశం ఉత్తర భారతం, దక్షిణ భారతం అని విడిపోయే ప్రమాదం ఉందని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు నిశ్చితార్థం వరకే వచ్చిందని.. ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.