LCA Tejas: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలిసారిగా లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ట్విన్-సీటర్ ట్రైనర్ వెర్షన్ ఎయిర్‌క్రాఫ్ట్ ను బెంగళూరులోని భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరితో కలిసి LCA తేజస్ ట్విన్-సీటర్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ నమూనాను అందుకున్నారు.
2001 లో తొలి ఎల్‌సీఏ తేజస్ ఎయిర్‌క్రాఫ్ట్ వచ్చింది. అప్పటి నుంచి ఎన్నో మైలు రాళ్లను దాటుకుంటూ ఈ స్థాయికి ఎదిగింది. ఎల్‌సీఏ తేజస్ ట్విన్-సీటర్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ భారతదేశ అధునాతన ఏరోస్పేస్ సామర్థ్యాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎల్‌సీఏ తేజస్ ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో తయారైంది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను అభివృద్ధి చేశారు.
అత్యాధునిక డిజైన్, 4.5 జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ట్, రిలాక్స్‌డ్ స్టాటిక్ స్టెబిలిటీ, అడ్వాన్స్‌డ్ గ్లాస్ కాక్‌పిట్, క్వాడ్రప్లెక్స్ ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ కాంపోజిట్ మెటీరియల్స్ వంటి ఫీచర్లతో ఈ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ను అభివృద్ధి చేశారు.
ఈ ట్విన్-సీటర్ ఎయిర్‌క్రాఫ్ట్.. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సామర్థ్యాలకు నిదర్శనంగా నిలవడమే కాకుండా.. వ్యూహాత్మక ప్రయోజనానికి కూడా ఉపయోగపడుతుంది. ఎమర్జింగ్ పైలట్ లను ఫైటర్ పైలట్ లుగా మార్చడానికి, శిక్షణ, ఆపరేషనల్ డివైడ్ ను తగ్గించడానికి దీనిని రూపొందించారు. ఈ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ లు మరో 18 కావాలని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. 2023-24లో ఎనిమిదింటిని డెలివరీ చేయడానికి ప్లాన్ చేస్తోంది. మిగిలిన పదింటిని 2026-27 నాటికి క్రమంగా అందజేయనుంది హెచ్ఏఎల్.