Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు నేతల వలసల పర్వం కొనసాగుతోండగా.. మరోవైపు పొత్తుల అంశం, పార్టీ విలీనం అంశంపై చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒంటరిగా పోటీ చేస్తామనే సంకేతాలు ఇచ్చింది. ఇక కాంగ్రెస్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటనలు చేయడం లేదు. దీంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వామపక్ష పార్టీలు ముందుకొస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సిద్దంగా ఉన్నామని రెండు రోజుల క్రితం సీపీఎం ప్రకటన చేయగా.. శనివారం సీపీఐ కూడా స్పందించింది.
కాంగ్రెస్‌తో పొత్తుపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే విషయంపౌ తమ పార్టీ జాతీయ అధినాయకత్వం చర్చలు జరుపుతోందని వివరించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇవాళ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో చాడ వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో పొత్తుపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో సీపీఐ బలంగా ఉందని, తమ పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉన్నచోట తప్పకుండా పోటీలోకి దిగుతామని అన్నారు.
కమ్యూనిస్టులకు గౌరవం లేకపోతే ప్రజలకు కూడా గౌరవం లేనట్లేనని చాడ వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం సీపీఐ ఎన్నో ఉద్యమాలు చేసిందని, హుస్నాబాద్‌లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తప్పకుండా పోటీ చేస్తామని తెలిపారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ వైఖరికి సంబంధించి చాడ వెంకట్ రెడ్డి విమర్శలు కురిపించారు. కేవలం ఎన్నికల ప్రచార అస్త్రంగా దీనిని బీజేపీ మార్చుకుందని ఆరోపించారు.
మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు సీపీఎం కూడా ఆసక్తి చూపిస్తుంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీలో సీపీఎం, సీపీఐ నేతలు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఎంఐఎం, బీఆర్ఎస్‌లు బీజేపీకి మద్దతుగా ఉంటున్నాయని, దీంతో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని వామపక్ష పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అందరిని కేసుల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న బీజేపీ.. బీఆర్ఎస్, ఎంఐఎంలను మాత్రం ఏం చేయడం లేదని, దీనిని బట్టి చూస్తే బీజేపీకి ఆ రెండు పార్టీలు సపోర్ట్ చేస్తున్నట్లు అర్థమవుతుందని వామపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రస్తుతం చర్చలు జరుగుతుండటంతో త్వరలోనే కాంగ్రెస్-వామపక్షాల పొత్తుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, వామపక్ష పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీలోకి దిగుతుండగా.. తెలంగాణ జనసమితి వైఖరి ఏంటనేది ఇంకా తేలలేదు. గత ఎన్నికల తర్వాత వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయగా.. ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు.