తెలంగాణ రైతులు ప్రస్తుతం రెండు సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఒకటి ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదు, రెండోది రబీ పంటపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తోడుదొంగళ్లా మారాయని ఎద్దేవా చేశారు. చివరి గింజ వరకు కొంటామని చెప్పిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ ఏ విషయాన్ని తేల్చలేదన్నారు. కేంద్రం మెడలు వంచుతానని ప్రకటించిన కేసీఆర్.. కేంద్రం ముందు మెడలు వంచుకున్నారా అని ప్రశ్నించారు.


కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి సహకరించకపోతే.. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచినవా.. లేక ఆయన ముందు మెడలు వంచుకున్నావా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రైతులపై కేసీఆర్‌కు నిజంగానే ప్రేమ ఉంటే జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టాలని సూచించారు. కేంద్రం రా రైస్ కొంటామని చెబుతోంది.. కానీ దాని వల్ల నూక ఎక్కువ వస్తుందన్నారు. ముడి బియ్యాన్ని చేయడం వల్ల ఎకరానికి రూ.10 వేల భారం పడుతుంది.


కేంద్రం స్పందించకుంటే రాష్ట్ర రైతులను రోడ్డు పడేస్తారా.. ఇప్పుడు మీ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ ఎక్కడకు పోయారంటూ మండిపడ్డారు. చివరి గింజ వరకు నేనే కోంట అని గొప్పలు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు కేంద్రం ముందు మెడలు వంచుకున్నాడని.. రైతులపై చిత్తశుద్ధి ఉంటే ధర్నా చేయాలని సూచించారు. ఇతర పంటలకు మద్దతు ధర లేకనే రైతులు వరి వైపు మళ్లారు. రైస్ మిల్లర్ల చెప్పు చేతుల్లో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. 
Also Read: Telangana Devolopment : తెలంగాణ ఆదాయం అదుర్స్.. ఏడేళ్ల వృద్ధిపై ఆర్బీఐ లెక్కలు ఇవిగో..!


ముందు ఖరీఫ్ పంటను కొనండి..
తెలంగాణ ప్రభుత్వం రబీలో వేయాల్సిన పంటల గురించి ఉపన్యాసాలు ఇస్తోందని, అయితే ఖరీఫ్ లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైతులు కల్లాల్లో కష్టాలు పడుతుంటే.. సీఎం కేసీఆర్ ఢిల్లీలో, కలెక్టర్‌లు వాళ్ల ఇండ్లలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయశాఖ మంత్రి ఒక్క కల్లం అయినా తిరిగాడా.. సివిల్ సప్లై కమిషన్, వ్యవసాయ శాఖ కమిషన్ ఎక్కడకు పోయారంటూ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  


పంజాబ్‌లో కాంగ్రెస్ కానీ.. కేంద్రంతో తాడోపేడో
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నూతన సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుందన్నారు. తెలంగాణలో మాత్రం రైతు బంధు పేరుతో వారి రుణాలు ఎగ్గొట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో వడ్డీ రాయితీ లేదు, విత్తన రాయితీ లేదు, రుణాలకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక లేదు. రూ.5 వేల కోట్లు కేటాయిస్తే రైతులకు ఏ సమస్యలు ఉండవని.. అలా చూసే బాధ్యత తనదేనన్నారు.
Also Read: నేడు ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, అధికారుల బృందం.. ధాన్యం సేకరణపై కేంద్రంతో తేల్చుకుంటారా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి