Congress Mla Vemula Veeresam Comments in Assembly: గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల సంక్షేమ పథకాలను తీసేసిందని.. రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసిందని నకిరేకల్ (Nakirekal) ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresam) మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఆయన అసెంబ్లీలో ప్రతిపాదించగా.. దీన్ని మరో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennem Srinivas Reddy) బలపరిచారు. ఈ సందర్భంగా వేముల వీరేశం బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ బయటపెడతాం. బీఆర్ఎస్ చేసిన తప్పులన్నీ నాకు తెలుసు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని చూసి బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారు.?' అని ఆయన నిలదీశారు.


'అహంకారం వీడండి'


బీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా అహంకారం వీడాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గత పదేళ్లుగా నియంతృత్వ విధానాలతో పరిపాలన సాగిందని మండిపడ్డారు. 'దళిత బంధు పేరుతో ప్రజలను మభ్యపెట్టారు. నన్ను అవమానించిన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి వచ్చాను. మీ పాలనలో ప్రజలకు దూరమైన ప్రగతి భవన్ ను.. మా ప్రభుత్వం వచ్చాక గోడలు బద్దలు కొట్టి అందుబాటులోకి తెచ్చాం. ప్రజా సమస్యలు నేరుగా విని పరిష్కరించేలా చర్యలు చేపట్టాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్, పాలమూరు ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. దళిత, గిరిజన, మైనార్టీ పక్షపాత ప్రభుత్వమిది. గత ప్రభుత్వం రిజర్వేషన్ల పేరుతో గిరిజనులు, మైనార్టీలను మోసం చేసింది. ఆత్మ గౌరవం, స్వేచ్ఛ కావాలంటూ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్తున్నారు.' అని వేముల పేర్కొన్నారు.


'త్వరలోనే 2 గ్యారెంటీలు'


రాష్ట్రంలో ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేశామని.. త్వరలోనే మరో 2 గ్యారెంటీలను అమలు చేసేలా చర్యలు చేపట్టామని వేముల వీరేశం వివరించారు. 'పదేళ్ల అవినీతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అనేక నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. సాగునీటి రంగంలో దక్షిణ తెలంగాణపై వివక్ష చూపించారు. నల్గొండ జిల్లాలో పదేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు. గ్రామాల్లోనూ బోర్లు వేసుకునే పరిస్థితి లేకుండా చేశారు.' అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ కారులంటే బీఆర్ఎస్ కు కనీసం గౌరవం లేదని ధ్వజమెత్తారు. ప్రజా గాయకుడు గద్దర్ ను ఘోరంగా అవమానించారని.. గురుకుల పాఠశాలలకు ఎక్కడా సొంత భవనాలు లేవని అన్నారు. ఉద్యోగ నియామకాల్లోనూ ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని.. పరీక్షల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ వర్శిటీలను ధ్వంసం చేసి.. ప్రైవేట్ వర్శిటీలకు అడ్డగోలు అనుమతులను మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాలు, ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కొన్ని నెలల్లోనే పడగొడతామంటూ బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు, తమ మేనిఫెస్టోలో మొత్తం 250 అంశాలు ఉంటే.. బీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో అన్నీ మోసపూరిత హామీలే ఉన్నాయని యెన్నెం శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.


Also Read: Telangana Assembly: ఆటోల్లో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - అడ్డుకున్న పోలీసులు, అసెంబ్లీ గేట్ వద్ద ఉద్రిక్తత