Congress Leader Bhatti Vikramarka : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనాదిగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు భట్టి విక్రమార్క. ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కు వినతి పత్రం అందజేశారు. పోడువ్యవసాయం చేస్తున్న రైతులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సింగరేణి బొగ్గుగనుల్లో సమస్యలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరి, ధరణి సమస్యలు పరిష్కరించాలని పలు సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కంటి వెలుగు రెండో విడత ప్రారంభ కార్యక్రమానికి భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు.
1) అనాదిగా అడవిప్రాంతాన్ని నమ్ముకొని పోడువ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అటవి భూమి రక్షణ చట్టం ద్వారా వారు సాగుచేస్తున్న భూమికి పట్టాలు తక్షణమే అబ్దిదారులకు అందజేయాలి. ఇటీవల జరిగిన భూమి సర్వే అవకతవకలను సరిచేయవలసినటువంటి అవసరం ఉన్నది.
2) గడిచిన ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామి మేరకు రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం అశించిన స్థాయిలో లేదు. తక్షణమే ఖమ్మం జిల్లాకు రెండు పడకల గదుల ఇండ్లు మంజూరు చేయగలరని కోరుతున్నాము
3) గతంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు మధిర ప్రాంతంలో మహిళలు అసక్తిచూపిన “ఇందిరమ్మ డైరి" స్కీమ్‌ను విస్తృత ప్రాతిపదికన మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాము.
4) సింగరేణి బొగ్గుగనుల్లో 51 శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం దానిపై అజమాయిషి వహించి బొగ్గుగనులను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కేంద్ర నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించి ప్రైవేటీకరణను అడ్డుకోవలసినదిగా కోరుతున్నాము.
5) ప్రతి ఉమ్మడి జిల్లాకు రాష్ట్రంలో యునివర్సిటిని మంజూరు చేశారు. అందుకు ఖమ్మం జిల్లా మాత్రం యునివర్సిటికి నోచుకోలేదు. తక్షణమే ఖమ్మం జిల్లాకు యునివర్సిటిని మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము.
6 మధిర శాసనసభ నియోజక వర్గానికి జిల్లా మొత్తానికి ఉపాధ్యాయులను అందించినటువంటి ఘనత పొందిన మధిరకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కలశాల మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాము.
7) రాష్ట్ర విభజనలో హక్కుగా పొందిన బయ్యారం ఉక్కుప్యాక్టరిని మంజూరు చేయించి తక్షణమే సంబంధిత పనులు ప్రారంబించి జిల్లా ప్రజల కలలు నేరవేర్చాలని కోరుచున్నాము.
8) ధరణి సమస్యలు తక్షణమే పరిష్కరించి పాస్పుస్తకాలు అందజేయుటకు రెవిన్యూ అధికారులను అదేశించవలసినదిగా కోరుచున్నాము.
9) జర్నలిస్టులకు ఇండ్ల ప్లాట్లు మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము.
10) అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయవలసినదిగా కోరుచున్నాము.
పైన పేర్కొన్న అంశాలు జిల్లా ప్రజల అకాంక్షలు వీటితో ముడిపడి ఉన్నాయి. అందుచేత ఇవి ప్రాధాన్యత కలిగిన సమస్యలుగా మిగిలి ఉన్నాయి. వీటిని సహృదయంతో మీరు పరిశీలించి వీటిపై తగినంత త్వరలో నిర్ణయం తీసుకొని ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్షలు నేరవేరుస్తారని ఆశిస్తున్నామని సీఎం కేసీఆర్ ను సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క కోరారు.