జగిత్యాల పట్టణంలో 5 కోట్లకు పైగా అప్పులు చేసి 18 నెలల కిందట పారిపోయిన పోచమ్మ వాడకు చెందిన రేగొండ నరేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డిఎస్పీ ప్రకాష్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రకాష్.. నిందితుని నుండి 3 కిలోల 350 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2021 అక్టోబర్ నెలలో పారిపోయిన రేగొండ  నరేష్  ఇంతకాలం పాటు వివిధ ప్రాంతాల్లోని లాడ్జిల్లో ఇతర ప్రదేశాల్లో తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిసింది.


పథకం ప్రకారం భారీ మోసం..
నిజానికి ప్రజల నుండి సొమ్ము కాజేయడానికి నరేష్ భారీ స్కెచ్‌కు తెరలేపాడు. మొదట తనను తాను ఒక సామాజిక సేవకుడిగా పబ్లిక్ లో గుర్తింపు తెచ్చుకునేందుకు అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహించేవాడు ... అయితే వాటికి కావాల్సిన ప్రచారం రావడానికి విపరీతంగా ప్రయత్నించేవాడు .ఇక పెద్దపెద్ద అధికారులు రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు చూపిస్తూ... మెల్లగా తన వ్యూహానికి పదును పెట్టాడు. తనకు పెద్దపెద్ద కాంట్రాక్టర్ దత్తాయని కొందరికి అనేక వ్యాపారాల్లో తనకు లాభాలు వస్తున్నాయి అంటూ ప్రజల్ని నమ్మించడం మొదలుపెట్టాడు ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని వారి దగ్గర నుండి నగలు ఇతర రూపంలో ఉన్న బంగారాన్ని పెట్టుబడి కోసం అంటూ తీసుకునేవాడు మొదట్లో ఇంట్రెస్ట్ కట్టినట్టుగా నటించి ఆ తర్వాత మొత్తానికి ఎగ్గొట్టేవాడు. నరేష్ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో చిన్న చిన్న వేషాల్లో కనిపించాడు.


ఇక పలువురు రిటైర్డ్ అధికారులు కీలక వ్యక్తుల నుండి కూడా నరేష్ పెట్టుబడుల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. అయితే దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో క్లారిటీ రాలేదు. మరోవైపు తనకు డాక్టరేట్ ఇవ్వడానికి కొందరు అధికారులను మభ్యపెట్టి పెద్ద ఎత్తున సొమ్ము ముట్ట చెప్పినట్టు... అంతేకాకుండా ఆ కార్యక్రమ నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది..


అసలు సొమ్ము ఎంతో?
రేగొండ నరేష్ కి చెందిన మోసాన్ని మొదట్లో గుర్తించిన బాధితులంతా కలిసి తాము నష్టపోయిన డబ్బు ..గోల్డ్ వివరాలను అప్పట్లోనే లిస్టు తయారు చేశారు.. మరోవైపు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు సైతం చేశారు.. అప్పటినుండి పరారీలో ఉన్న నరేష్ అసలు ఎంత సొమ్ము కాజేసాడని విషయంపై పూర్తి వివరాలు అందుబాటులోకి రాలేదు కానీ ఇలా అక్రమంగా సంపాదించిన సొమ్ముతో జల్సాలు చేస్తూ పలువురు బుల్లితెర సెలబ్రిటీలను సైతం తన మోసాల వలలో వేసుకున్నట్టు తెలిసింది. వారితో ఫోటోలు దిగుతూ తన మోసాన్ని హైదరాబాద్ వరకు విస్తరించడానికి ప్రయత్నించినట్లు బాధితులు ఆరోపించారు. ఒకానొక సమయంలో దేశం దాటి పారిపోవడం సైతం ప్రయత్నాలు చేసినట్టుగా గుర్తించిన బాధితులు ఎక్కడైనా సమాచారం దొరుకుతుందేమోనని సొంతంగానే వాకబు చేశారు చివరికి ఓ లాడ్జిలో ఉండడంతో పోలీసులు అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించి కొంతలో కొంత సొమ్ము అయినా రాబట్టారు.