APNGO New President: ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ రాష్ట్ర సంఘం ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శిగా కేవీ శివారెడ్డిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈరోజు విజయవాడలో జరిగిన ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్జీఓ ఎన్నికల్లో పోటీ చేసిన బండి శ్రీనివాస రావు ప్యానెల్ వర్గం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాలు చేశారు. ఈ నామినేషన్లకు రాష్ట్రం నలు మూలల నుండి ఉద్యోగులు భారీగా తరలి వచ్చారు. అయితే రాష్ట్రంలో ఉన్న కార్మిక, ఉద్యోగుల పెన్షన్ల కోసం పోరాడుతున్న తమను గెలిపించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగులకు నూతన అధ్యక్షులు బండి శ్రీనివాస రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉద్యోగులు అనేక సమ్యలను ఎదుర్కుంటున్నారని... వాటిని తాము త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పుకొచ్చారు. జీపీఎఫ్, ఏపీజీఎల్ఐసీ, సరండర్ సెలవులు దాదాపు సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బండి శ్రీనివాస రావు  డిమాండ్ చేశారు.


మూడు డీఏల్లో ఒకటి చెల్లిస్తామన్నారు - ఆ ఒక్కటి కూడా చెల్లించట్లే!


సంక్రాంతికి ఉన్న మూడు డీఏలలో ఒక్కటి చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారని.. కానీ అది ఇప్పటి వరకూ అమలు కాలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా డీఏ చెల్లింపుపై సీఎం కార్యాలయం బాధ్యత వహించాలని నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు సూచించారు. తమకు గానీ తమ ఉద్యోగులకు గానీ ప్రభుత్వంతో ఘర్షణకు దిగాలని లేదన్నారు. అలాగే మాస్కులు, శానిటైజర్లు లేక వైద్యలు, మెడికల్ సిబ్బంది చాలా సమస్యలు ఎదుర్కుంటుందని తెలిపారు. కానీ ఉద్యోగుల హక్కుల సాధన కోసం అవసరం అయితే దశల వారీగా పోరాటాలు చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఉద్యమాలకు దిగక ముందే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే బాగుంటుందని చెప్పారు. 


హామీలు నెరవేర్చకపోతే ఉద్యమిస్తాం: శివారెడ్డి


11వ పీఆర్సీలోని ఉద్యోగుల నష్టాన్ని, 12వ పీఆర్సీలోనైనా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని సంఘ నూతన ప్రధాన కార్యదర్శి శివారెడ్డి కోరారు. మూడు ఏళ్లు దాటుతున్నా ఇంకా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయలేదని ఆగ్రహించారు. జీపీఎస్ కు ఒప్పుకునేది లేదని ఓపీఎస్ ను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాటంనేని భాస్కర్ జీఓ 64 అనే మహమ్మారిని తీసుకొచ్చారని.. దీన్ని తక్షణమే రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. జీఎస్టీ అధికారుల అందరికీ గెజిటెడ్ స్థాయి కల్పించాలని అన్నారు. సముద్రం లాంటి సంఘంలో నుంచి చిన్న పాయలు పక్కకి పోతే పోయిందేమీ లేదన్నారు. కరోనా తీవ్రత తగ్గాక అందరం కలిసి ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. డిపార్ట్ మెంట్ హెచ్ఓడీలకు మాత్రమే అవగాహన ఉండే సీఆర్ ను వారే ఇచ్చేలా చూడాలన్నారు. కరోనా కాలంలో ఎంతో వీరోచితమైన సేవ చేస్తున్న వైద్యో ఉద్యోగులు, వైద్యులతో కలిసి ఉద్యమం చేయడానికి ఏపీఎన్జీఓ సిద్ధంగా ఉందని తెలిపారు.