Mynampalli :  బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే, మరో సారి టిక్కెట్ పొందిన మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా తెలుస్తోంది.   తన కుమారుడు రోహిత్‌కి మెదక్ అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తికి గుర్యయారు. తనకు రెండు టిక్కెట్లు ఇస్తే కాంగ్రెస్ లో చేరుతాననే ప్రతిపాదన పెట్టడంతో కాంగ్రెస్ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అన్ని  చర్చలు పూర్తి కావడంతో  మైనంపల్లి హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌లోని తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభలో   మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం సాగుతోంది.
 
తన కుమారుడే తనకు ముఖ్యమన్న మైనంపల్లి            


తన కుమారుడికి మెదక్ నుంచి బీఆర్ఎస్ టికెట్ కేటాయించపోవడంతో ఆ పార్టీపై మైనంపల్లి తిరుగుబాటు చేశారు. మంత్రి హరీష్ రావుపై తిరుమల వేదికగా ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపాయి. దీంతో మైనంపల్లిపై బీఆర్ఎస్ వేటు వేస్తుందనే ప్రచారం నడిచింది. ఈ క్రమంలో మైనంపల్లిని తమవైపుకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవల మైనంపల్లితో టీ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన తర్వాత మైనంపల్లి చేరిక ఖరారైనట్లు సమాచారం.


రెండు టిక్కెట్ల ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్                                       


మైనంపల్లికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మల్కాజ్‌గిరి టికెట్ హన్మంతరావు, మెదక్ నుంచి రోహిత్‌కు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఆ హామీతోనే మైనంపల్లి హస్తం గూటికి చేరుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి మెదక్ టికెట్ ఇప్పటికే పద్మా దేవేందర్ రెడ్డికి ఫిక్స్ చేయడంతో.. తన కుమారుడిని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో పోటీలోకి దింపాలని మైనంపల్లి భావిస్తున్నారు. మెదక్ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పడంతో వెంటనే చేరేందుకు సిద్దమవుతున్నారు.


మైనంపల్లిని బుజ్జగించేందుకు బీఆర్ఎస్  చివరి ప్రయత్నాలు                               


బీఆర్ఎస్‌ను వీడటంపై ఇప్పటికే మైనంపల్లి హింట్ ఇచ్చారు. తాను బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్నానని, వచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానంటూ ఇటీవల ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న మైనంపల్లి.. ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. ఆ పార్టీ శ్రేణులతో కూడా టచ్‌లో ఉండటం లేదు. అయితే మైనంపల్లిని బీఆర్ఎస్ అగ్రనేతలు బుజ్జగిస్తారని చెబుతున్నారు.