Mynampalli : కుమారుడి టికెట్ అంశంపై మంత్రి హరీష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హన్మంతరావు వారం రోజుల పాటు మల్కాజిగిరి నియోజవర్గంలో పర్యటించాలని నిర్ణయించుకున్నారు. అనుచరులు, కార్యకర్తలతో మైనంపల్లి దూలపల్లిలోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. తనను వ్యక్తిగతంగా ఎవరైనా ఇబ్బంది పెడితే తాను ఇబ్బంది పెడతానని వార్నింగ్ ఇచ్చారు. ప్రాణం పోయే వరకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతానన్నారు. వెనక్కి తగ్గే వ్యక్తిని కాదన్నారు. మెదక్ నియోజకవర్గంలో ముఖ్య నాయకులు ఇబ్బంది పెడుతున్నారని మైనంపల్లి ఫైర్ అయ్యారు. రేపటి నుంచి వారం పాటు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో తిరుగుతానని ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నరు.
ఇప్పటికే టిక్కెట్ ప్రకటించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మైనంపల్లిని మల్కాజిగిరి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే మైనంపల్లి కాకపోతే ఎవరు అన్న దిశగా అభ్యర్థి కసరత్తును కూడా ప్రారంభించినట్లుగా చెబుతున్నారు. మైనంపల్లిని ఏ క్షణమైనా సస్పెండ్ చేస్తారని చెబుతున్నారు. మైనంపల్లి కూడా తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వకపోతే తాను బీఆర్ఎస్ తరపున పోటీ చేసేది లేదంటున్నారు.
రెండు టిక్కెట్ల ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్
మైనంపల్లి పొటెన్షియల్ లీడర్ భావిస్తున్న కాంగ్రెస్ రెండు టిక్కెట్లు ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. శుక్రవారం కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి చర్చలు జరిపారని అంటున్నారు. మైనంపల్లికి మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మెదక్ టికెట్ ఆశిస్తున్న తిరుపతిరెడ్డి, శశిధర్‌రెడ్డిలతో కూడా మాట్లాడారని.. మైనంపల్లి కుమారుడు పోటీ చేస్తే సహకరిస్తామని వారితో ఒప్పించినట్లుగా తెలుస్తోంది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే నందికంటి శ్రీధర్‌ను కూడా బుజ్జగిస్తున్నారు. పార్టీలో చేరిన అసంతృప్తుల బెడద ఉండదని అంటున్నారు. మైనంపల్లి ఆర్థికంగా బలవంతుడైన నేత కావడంతో కాంగ్రెస్ నేతలు మరింతగా ఆసక్తి చూపించి ఆయనను ఆకర్షంచే ప్రయత్నం చేస్తున్నారు.
ఫైనల్ నిర్ణయం మైనంపల్లిదే !
ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఇంకా నెలన్నర వరకూ సమయం ఉంది. అందుకే మైనంపల్లి ఇటు బీఆర్ఎస్ టిక్కెట్ ను తీసుకుని పోటీ చేస్తానని చెప్పకుండా.. మరో వైపు కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తూ కీలక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మైనంపల్లి రోహిత్ ఇప్పటికే మెదక్ నియోజకవర్గంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ దగ్గరయ్యారని.. కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధిస్తారని అంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ రెండు టిక్కెట్ల ఆఫర్ తో రెడీగా ఉంది. ఇక చాయిస్ .. మైనంపల్లిదేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.