Telangana Elections: సోమవారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన క్రమంలో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలవ్వడంతో పార్టీలన్నీ వ్యూహలకు మరింత పదునుపెడుతున్నాయి. అందులో భాగంగా పొత్తులు కూడా పొడుస్తున్నాయి. కాంగ్రెస్‌తో సీపీఎం, సీపీఐ పొత్తు ఖరారు అయింది. అంతేకాదు సీట్ల సర్దుబాటు కూడ ఒక కొలిక్కి వచ్చింది. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
ముందుగా సీపీఎం, సీపీఐకి చెరొక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. కానీ కాంగ్రెస్ ప్రతిపాదనను కమ్యూనిస్టులు తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ తలొగ్గి చెరోక రెండు స్థానాలు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. సీపీఐకి కొత్తగూడెం, మునుగోడు నుంచి, సీపీఎంకు భద్రాచలం, మిర్యాలగూడ నుంచి టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. భద్రాచలం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఉన్నారు. అయినా అక్కడ వామపక్ష పార్టీల బలం ఎక్కువగా ఉండటంతో సీపీఎంకు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పోడెం వీరయ్యను పినపాక నియోజకవర్గానికి పంపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపే యోచనలో ఉంది.
కాంగ్రెస్‌లో వామపక్షాల పొత్తుపై గత కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో భేటీ అయిన వామపక్ష నేతలు.. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని తీర్మానం చేశారు. అనంతం పలు దఫాలుగా కాంగ్రెస్‌తో చర్చలు జరిపారు. దీంతో కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఎట్టకేలకు పొత్తు ఖరారు అయింది. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు వామపక్ష పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్‌తో లెఫ్ట్ పార్టీల పొత్తు ఉంటుందనే వార్తలొచ్చాయి. వామపక్షాలకు బీఆర్ఎస్ రెండు, మూడు సీట్లు ఇస్తుందని టాక్ వినిపించింది. కానీ ఈ పొత్తు ముందుకు కదరలేదు.
బీఆర్ఎస్‌తో పొత్తు కుదరకపోవడంతో కాంగ్రెస్‌తో టచ్‌లోకి వామపక్షాలు వెళ్లాయి. ఏపీతో పోలిస్తే తెలంగాణలో వామపక్షాలు కాస్త బలంగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో గణనీయమైన ఓట్లు కలిగి ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్.. వామపక్షాలను మరోసారి కలుపుకుంది. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి, వామపక్ష పార్టీలు కలిసి బరిలోకి దిగాయి. కానీ గత ఎన్నికల్లో మహాకూటమిలోని పార్టీల మధ్య ఓటు ట్రాన్స్‌ఫర్ జరగలేదు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని మూటకట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో కంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు తగ్గాయి. అయితే వామపక్షాల ఓట్లు సులువుగా ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశముంటుంది. దీంతో కామ్రేడ్స్‌ను కలుపుకోవడంలో కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగులు వేసింది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండలో వామపక్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆ రెండు జిల్లాల్లో పొత్తు వల్ల కాంగ్రెస్, వామపక్షాలకు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ కలుపుకోవాలని ప్రయత్నం చేసినా.. షర్మిల డిమాండ్ల వల్ల అది కురదలేదు.