Telangana BJP: కొత్త, పాత నేతల కలయిక బీజేపీ సరికొత్త వ్యూహంతో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రధాన నేతలు, కీలక నాయకులు, ముఖ్యుల్లో దాదాపు అందరినీ బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ముగ్గురు ఫైర్ బ్రాండ్ నేతలను బరిలోకి దించింది. 52 మందితో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈసారి రాజకీయ పోరు రసవత్తరంగా సాగనుంది. బీజేపీ ముగ్గురు ఫైర్ బ్రాండ్ నేతలు ఇక్కడి నుంచే పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఈసారి సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి బండి సంజయ్, ఈటల రాజేందర్.. జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ బరిలో నిలుస్తుండటంతో అందరి కళ్లూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపే ఉన్నాయి.
ఈటల పట్టు
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాను చేసిన ప్రకటనకు అనుకూలంగానే బీజేపీ జాతీయ నాయకత్వాన్ని ఒప్పించినట్టుగా స్పష్టం అవుతోంది. మొదటి నుంచి తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటిస్తూ వచ్చారు. ఇటీవల హుజూరాబాద్ లో పర్యటించినప్పుడు కూడా తాను రెండు చోట్లా పోటీ చేస్తానని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే బీజేపీ విడుదల చేసిన జాబితాలో ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్, గజ్వేల్‌లలో అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గట్టి పోటీ
సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి ఈటల పోటీ చేయనుండడంతో ఇక్కడ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు ఆయనపైనే పోటీ చేస్తుండడంతో ఫలితం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ అందిరిలోనూ నెలకొంది. గజ్వేల్‌తో పాటు సిరిసిల్ల కూడా ప్రాధాన్యత సంతరించున్న నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడి నుంచి రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పోటీ చేస్తుండడంతో ఆయనపై బీజేపీ తరఫున రాణి రుద్రమ పోటీ చేస్తున్నారు. దీంతో ఇక్కడి ఫలితంపైనా అందరూ ఆసక్తి చూపుతున్నారు.
బీజేపీ ఫైర్ బ్రాండ్‌లుగా ముద్రపడ్డ ఇద్దరు ముఖ్య నేతలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే పోటీ చేస్తుండడం విశేషం. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. కరీంనగర్ నుంచి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఈ ఇద్దరు ఎంపీలు ప్రత్యర్థి పార్టీల నాయకులపై విమర్శనాస్త్రాలు సంధించే తీరుతో ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఎన్నికల్లో పార్టీల కీలక నేతల మధ్య కొన్ని స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.