తెలంగాణ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ హీట్ నెలకొంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. అయితే, ఆయా పార్టీలు విడుదల చేసిన జాబితాల్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు. కొందరు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 27న ఢిల్లీలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి, ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా, పార్టీ కార్యక్రమాల్లో అంత చురుగ్గా పాల్గొనడం లేదు. 


3 రోజుల్లోనే స్పష్టత?


అయితే, ఈ ప్రచారంపై కాంగ్రెస్, బీజేపీ భిన్నంగా స్పందిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలో చేరితే తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికల్లో మునుగోడు లేదా ఎల్బీనగర్ నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నారని, అందుకు కాంగ్రెస్ నుంచి మంచి వాతావరణం ఉండడంతోనే పార్టీ మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమాలోచనలు జరుపుతున్నారని, 2, 3 రోజుల్లోనే కాంగ్రెస్ లో చేరికపై స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. 


ఇదే కారణమా.?


బీజేపీ విడుదల చేసిన తెలంగాణ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆయన అలిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే ప్రచారమూ సాగుతోంది. ఆయన గతేడాది ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2022, నవంబరులో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచీ బీజేపీలోనే కొనసాగుతున్నా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. అప్పుడప్పుడూ మాత్రమే బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


ఫేక్ అంటున్న బీజేపీ


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తారనే ప్రచారం పూర్తిగా ఫేక్ అని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి వదంతులు నమ్మొద్దని పేర్కొంటున్నాయి. ఇదంతా కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ అని ఆరోపిస్తున్నాయి. ఆయనకు బీజేపీ అంతా బాగానే ఉందని స్పష్టం చేశాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. 


రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే.?


కాగా, పార్టీ మార్పు ప్రచారంపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. 'ఉపఎన్నికలు, ఇప్పటికి రాజకీయ పరిస్థితులు మారాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజల ఆలోచనకు అనుగుణంగానే నా నిర్ణయం ఉంటుంది. కేసీఆర్ దుర్మార్గ పాలన అంతం కావాలనేదే నా లక్ష్యం. 2, 3 రోజుల్లో నా నిర్ణయం ప్రకటిస్తాను.' అని పేర్కొన్నారు.