తెలంగాణలోని వర్సిటీల పరిధిలోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష సీపీజీఈటీ (CPGET ) -2021 నోటిఫికేషన్‌ విడుదల అయింది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జూలై 30 నుంచి ప్రారంభం అవుతుందని సీపీజీఈటీ సెట్‌ కన్వీనర్‌ పాండు రంగారెడ్డి వెల్లడించారు.


దరఖాస్తు స్వీకరణ గడువు ఆగస్టు 25వ తేదీతో ముగియనుందని చెప్పారు. ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 30వ తేదీ వరకు.. రూ.2000తో సెప్టెంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ విధానంలో స్వీకరించనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీజీఈటీ ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు 8వ తేదీ నుంచి నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 


పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరిన్ని వివరాల కోసం www.osmania.ac.in, www.tscpget.com, www.ouadmissions.com వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు. 


కాగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచన మేరకు సీపీజీఈటీ సెట్‌ పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి ఉస్మానియా యూనివర్సిటీతోపాటు, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూ వర్సిటీలతో పాటు వాటి అనుబంధ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.


ప్రవేశ పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) నిర్వహించాలని ఉస్మానియా యూనివర్సిటీ భావిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. 


ఏయూ ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ ..
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ 2021 విద్యాసంవత్సరానికి గానూ ఇంజనీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఈఈటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అందించే వివిధ బీటెక్‌+ ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది.


కనీసం 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.


ఆగస్టు 17 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించింది. ఆలస్య రుసుము రూ.1500తో ఆగస్టు 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.


పూర్తి వివరాలకు http://aueet.audoa.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది. 


దీని ద్వారా ఆరేళ్ల బీటెక్ + ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ కోర్సులు అందించనుంది.


ప్రవేశ పరీక్ష ఆగస్టు 29వ తేదీన నిర్వహించనుంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడలలో పరీక్ష కేంద్రాలను కేటాయించింది. 


ఐకార్‌ నోటిఫికేషన్ విడుదల


కాగా వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, జేఆర్‌ఎఫ్‌, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐకార్‌) ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఈఈఏ- AIEEA) నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం https://icar.nta.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.