హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం కేసీఆర్ ఎంత మంది వస్తే అంత మందిని టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిని చేర్చుకోవాలని నిర్ణయించున్నారు. ఇప్పటి వరకూ బీజేపీలో ఉన్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. టీఆర్ఎస్‌తో చర్చలు పూర్తయిన తర్వాత .. ఆ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. 30వ తేదీన ముహుర్తం ఖరారు చేసుకున్నారు. కేసీఆర్ పోటీ చేయమంటే చేస్తానని లేకపోతే..  పార్టీ నియమించిన అభ్యర్థి గెలుపు కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. గతంలో హుజూరాబాద్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఇనుగాల పెద్దిరెడ్డి. 

  
హుజూరాబాద్ అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చి .. టీఆర్ఎస్‌లోకి చేరిన నేతల్లో పెద్దిరెడ్డి సంఖ్య చాలా ఎక్కువే. కేసీఆర్ వారానికొకరని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థి అవుతారో తెలియదు కానీ...  చేరికలు మాత్రం వారానికొకటి ఉండేలా చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీన కౌశిక్ రెడ్డిని గత వారమే పార్టీలో చేర్చుకున్నారు. టిక్కెట్ గురించి చెప్పలేదు. కానీ రాష్ట్ర స్థాయి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాత్రం టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతకు ముందు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఆయన కూడా అభ్యర్థేనన్న ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. ఈటల  బీసీ నినాదానికి రమణ సరైన అభ్యర్థి అని టీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన పేరుపైనా స్పష్టత లేదు. 


ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి మరొకర్ని పార్టీలో చేర్చుకున్నారు.  మరికొంత మంది అధికారుల  పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.  హుజూరాబాద్‌లో ఎవరిని నిలబెట్టాలన్న అంశంపై ఇంత వరకూ  టీఆర్ఎస్ హైకమాండ్‌కు స్పష్టత లేదు. రోజుకో సమీకరణం చూసుకుంటూ.. నేతల్ని చేర్చుకుంటున్నారు. ఎవర్నీ చేర్చుకున్నా.. తర్వాత  మరింత బలమైన నేత కోసం.. కేసీఆర్ చూస్తున్నారు. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో అన్ని రకాల సమీకరణాలను చూసుకునేందుకు వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారని చెబుతున్నారు. 


తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్నప్పటి నుండి కేసీఆర్‌తో పెద్దిరెడ్డికి పరిచయం ఉంది. అయితే.. ఆయన చాలా రోజుల నుంచి రాజకీయంగా ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదు. దేవేందర్ గౌడ్‌తో పాటు తెలంగాణ వాదంతో పీఆర్పీలోకి వెళ్లి.. తిరిగి టీడీపీలోకి వచ్చారు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లారు. కానీ ఎక్కడా తన బలాన్ని ప్రదర్శించలేకపోయారు. మాజీ మంత్రిగా మాత్రమే  .. ఉనికి చాటుకుంటూ వస్తున్నారు.