T Congress Revant Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు వర్సెస్ రేవంత్ పంచాయతీ తెగడం లేదు. తాజాగా ఆయన ఓ ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలతో కలకలం ప్రారంభమయింది. తమ పార్టీలో సీనియర్ నేతలు కేసీఆర్‌తో కుమ్మక్కయి పార్టీ మారారాని అందుకే.. కొత్త తరం పార్టీలో పెరిగిందన్నారు. తనకు టీ పీసీసీ చీఫ్ అందుకే వచ్చిందన్నారు. అయితే ఇది పార్టీ మారిన వారిని కాకుండా సీనియర్లను అన్నారంటూ కొంత మంది నేతలు విమర్శలు ప్రారంభించారు. హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే కోవర్టులనే పంచాయతీ నడుస్తోంది. దీంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇప్పటికే రేవంత్ ను వ్యతిరేకిస్తున్న కొంత మంది నేతలపై కోవర్టులనే ముద్రను కొంత మంది సోషల్ మీడియాలో వేశారు. తమను కోవర్టులంటున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓ సారి ఫైర్ అయ్యారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కోవర్టులంటూ పోస్టర్లు కూడా ముద్రించారు. ఈ పరిమామాల మధ్య.. రేవంత్ రెడ్డి మళ్లీ సీనియర్లు... కేసీఆర్ తో కుమ్మక్కు వంటి పదాలు వినియోగించడంతో వారంతా మళ్లీ యాక్టివ్ అయ్యారు. దీనిపై రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. తాను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. తాను అనని వాటిని అన్నట్లుగా ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. రాజకీయ వివాదాలు సృష్టించి సమస్యలు జఠిలం చేయవద్దని ఆయన కొన్ని మీడియా సంస్థలకు సూచించారు.
ఇప్పటికే రేవంత్ కు పోటీగా పాదయాత్రలను సీనియర్ నేతలు ప్రకటించారు. టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రేకు ఏఐసీసీ వ్యవహారాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేఖ రాయడం పార్టీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొద్ది రోజులు పాదయాత్ర కొనసాగించారు. తర్వతా ఆపేశారు. తనను 4 రోజులు పాదయాత్ర చేశాక ఆపేయమన్నారని మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. తాను పార్టీకి కట్టుబడి పనిచేసే వ్యక్తినని.. పార్టీ కోసమే పాదయాత్ర చేశానని లేఖలో తెలిపారు. తాను పార్టీకి నష్టం చేకూర్చే పని ఎప్పుడూ చేయలేదని చెప్పారు. కొందరిలా సొంత ఎజెండాతో పాదయాత్ర చేయలేదని అన్నారు. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇంచార్జ్‌గా ఉన్న మీరే తనను అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. మీరు ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని లేఖలో పేర్కొన్నారు.
మరో వైపు భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. అయితే పాదయాత్రలు చేయాలని హైకమాండ్ ఆదేశించిందని.. హాత్ సే హాత్ జోడోయాత్రలు అందుకే చేస్తున్నారని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందరూ పాదయాత్రలు చేయాలంటున్నారు. సీనియర్ల విషయంలో రేవంత్ అప్రమత్తంగా ఉంటున్నా జరుగుతున్న ప్రచారాలు మాత్రం ఆయనను ఇబ్బంది పెడుతున్నాయి. రేవంత్ రెడ్డి పరిస్థితి టీ పీసీసీలో కత్తి మీద సాములా మారింది. ఏ చిన్న మాట తేడాగా ఉన్నా అవి తమను అవమానించేవే అంటూ సీనియర్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తున్నారు.