Cm Revanth Review On Grain Purchases And Drinking Water: రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని.. అన్నదాతల నుంచి ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. 'వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయాలి. కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి.' అని అధికారులను సీఎం ఆదేశించారు.
రైతులకు ఇబ్బంది లేకుండా..
కొన్ని చోట్ల తేమ ఎక్కువగా ఉందని చెప్పి వ్యాపారులు, మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో అన్నదాతలు ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని సీఎం రైతులకు విజ్ఞప్తి చేశారు. నేరుగా కళ్లాల నుంచి వడ్లను మార్కెట్లకు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని.. ఒకటి రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మంచి రేటు పొందాలని సూచించారు. ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డుల్లోనే తగిన ఏర్పాట్లు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వడ్ల దొంగతనం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని చెప్పారు. కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని, రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలని.. వడగండ్ల వానలు వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు.
తాగునీటి సరఫరాపై
రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా రాబోయే రెండు నెలలు మరింత కీలకమని.. గతేడాదితో పోలిస్తే ఎక్కువ నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ప్రజల అవసరాలకు సరిపోవటం లేదని సీఎం గుర్తు చేశారు. అప్పటి కంటే భూగర్భ జల మట్టం పడి పోవటంతో ప్రజలు కేవలం నల్లా నీటిపైనే ఆధారపడటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. 'తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. ఎక్కడైనా ఫిర్యాదు వచ్చినా వెంటనే అక్కడ తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలి. ఏ రోజుకారోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సారధ్యంలో మిషన్ భగీరథ, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్తు శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై సమీక్ష జరపాలి.' అని సీఎం నిర్దేశించారు.
భాగ్యనగరంలో..
హైదరాబాద్ లో తాగునీటి సరఫరాకు ఢోకా లేకుండా, మరింత డిమాండ్ పెరిగినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తెచ్చుకోవాలని, అందుకు తగిన ఏర్పాట్లు వెంటనే చేయాలని ఆదేశించారు. ఇటు సింగూర్ నుంచి నీటి సరఫరా చేసేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. కృష్ణా బేసిన్ లో నీటి లభ్యత లేనందున ఎగువన నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి తాగునీటిని తెచ్చుకునేలా కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని అధికారులకు సూచించారు. అటు, ఉద్దేశపూర్వకంగా తాగునీటి సరఫరాకు ఆటంకం కల్పించిన వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అకారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు.
Also Read: Warangal News: వరంగల్ అభ్యర్థిని ఫిక్స్ చేసిన కేసీఆర్, రాజయ్యకు మళ్లీ బ్యాడ్ లక్!