Rebel candidates are increasing in Telugu Desam Party  :  ఏపీలో పొత్తులు, కూటముల మధ్య  సీట్ల సర్దుబాటు కారణంగా టిక్కెట్లు పొందలేని నేతలు రెబల్స్ గా మారుతున్నారు. అంతకంతకూ వీరి సంఖ్య పెరుగుతోంది.   ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామరాజుకే సీటు ఇవ్వాలంటూ ఆయన అనుచరులు ఆందోళన చేస్తున్నారు. రఘురామకు అక్కడ టిక్కెట్ కేటాయించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. న్యాయం చేస్తామని చెప్పినా రామరాజు అనుచరులు పట్టు వీడటం లేదు. ఇప్పటికే ఉండి నియోజకవర్గం నుంచి వేటుకూరి శివరామరాజు అనే మరో అభ్యర్థి రెబల్ గా బరిలో ఉంటానని ప్రకటించి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క ఉండిలోనే ఇద్దరు రెబల్ అభ్యర్థులు అయ్యే అవకాశం కనిపిస్తోంది.  


అల్లూరు జిల్లాలోని టిడిపిలోనూ అసమ్మతి సెగ కొనసాగుతోంది. అరకులోయ టిడిపిలో టికెట్‌ చిచ్చు పెట్టింది. ప్రస్తుతం ఇంచార్జ్‌గా ఉన్న దొన్ను దొర.. తిరుగుబావుటా ఎగురవేశారు. కూటమి అభ్యర్థిపై ఇండిపెండెంట్‌గా పోటీకి సై అంటున్నారు. హైదరాబాద్‌లోని ఇంటికి పిలిచి MLC ఇస్తామని తనకు చెప్పినా.. చంద్రబాబును నమ్మొద్దని కేడర్‌ చెబుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు మొదట దొన్నుదొరకే టిక్కెట్ ప్రకటించారు. కానీ అనూహ్యంగా ఈ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. మరో ఎస్టీ నియోజకవర్గం అయిన పాడేరులో  రెబల్‌ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు పాడేరు ఇంచార్జ్‌ గిడ్డి ఈశ్వరి ప్రకటన చేశారు. అక్కడ టీడీపీకే స్థానం వచ్చిన అభ్యర్థిగా ఇతరులకు చాన్స్ ఇవ్వడంతో గిడ్డి ఈశ్వరి అసంతృప్తికి గురయ్యారు. 


అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీలో అసంతృప్తి నెలకొంది. కార్యకర్తల సమావేశంలో మాజీ MLA గవిరెడ్డి రామానాయుడు కంటతడి పెట్టారు. కష్టకాలంలో కూడా పార్టీ కోసం కృషి చేశానని భావోద్వేగానికి గురయ్యారు. పార్టీని నమ్ముకుంటే.. అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో టికెట్ ఇవ్వకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అల్టిమేటం జారీ చేశారు. రాజంపేటలో టిడిపి అసమ్మతి నేత బత్యాలతో ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంతనాలు జరిపారు. బత్యాలను రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.                                    


కాకినాడ జిల్లా అనపర్తి, ఏలూరు జిల్లా గోపాలపురం సహా అనంతపురంలోనూ టిడిపి నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వలేని పక్షంలో తమకు ప్రత్యామ్నాయం చూపాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం కచ్చితంగా పోటీలో ఉంటామని చెబుతున్నారు. వీరందర్నీ బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలను పంపి.. మాట్లాడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలని అనుకుంటున్నారు. అందుకే  ఇండిపెండెంట్ల బెడద టీడీపీకి ఎక్కువగా  ఉండే  అవకాశాలు కనిపిస్తున్నాయి.