CM Revanth Reddy Slams Brs in Munuguru Meeting: తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ మిగలరని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో (Manuguru) నిర్వహించిన 'ప్రజా దీవెన సభ'లో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటేనని.. ఇవి కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని.. తమ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని చేసినా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ 14 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నెరవేర్చలేదని.. కేసీఆర్ ను ఖమ్మం జిల్లా ప్రజలు ఏనాడూ నమ్మలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి ఖమ్మం జిల్లాలో హస్తం పార్టీ అద్భుతమైన విజయాలు సాధించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలేనని ప్రశంసించారు. '18 ఏళ్లుగా ఖమ్మం జిల్లా ప్రజలు కాంగ్రెస్ కు అండగా నిలబడి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నాతో రక్తసంబంధం లేకపోయినా పార్టీ గెలుపు కోసం మీ రక్తాన్ని చెమటగా మార్చి పని చేశారు. జిల్లాలో మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో ఖమ్మం నుంచే ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాం. ఈ ఇళ్లు పేదలకు దేవాలయాలు. వీటి నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ హామీలను అమలు చేయకుండా మోసం చేశారు. అందుకే ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ ను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టారు. ఇచ్చిన మాట తప్పని నాయకురాలు  సోనియాగాంధీ. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతీ తలుపు తట్టండి.. సోనియమ్మ మాటను ప్రతీ ఇంటికి చేరవేయండి.' అని సీఎం పిలుపునిచ్చారు.


'బీఆర్ఎస్ - బిల్లా రంగా సమితి'


ఇందిరమ్మ రాజ్యంలో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. 'పదేళ్లలో ఎవరికైనా కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారా.?. మంచి చేస్తుంటే ఓర్వలేక తండ్రీ కొడుకులు, మామా అల్లుళ్లు, తండ్రీ కూతురు శాపనార్థాలు పెడుతున్నారు. 90 రోజుల్లోనే గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించాం. బీఆరెఎస్ అంటేనే బిల్లా రంగా సమితి. ప్రాజెక్టుల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టి ఖమ్మం జిల్లాకు తాగు నీరు లేని పరిస్థితి తీసుకొచ్చారు.' అంటూ రేవంత్ మండిపడ్డారు. 


'అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు.?'


బీజేపీ ప్రకటించిన 9 సీట్లలో బీఆరెఎస్ తమ అభ్యర్థులను  ప్రకటించడంలేదని.. బీఆర్ఎస్ ప్రకటించిన 4 సీట్లలో బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటప్పుడే వీరి మధ్య అవగాహన ఎలా ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుని.. కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 'మేం రాజనీతిని పాటించాలనుకుంటున్నాం. కానీ మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకుంటామనుకోకండి. మాకు లోతు తెలుసు.. ఎత్తు తెలుసు. మా కార్యకర్తలు చేసే చప్పుడుకు మీ గుండెలు అదురుతాయ్. ఎవ్వడు అడ్డు వచ్చినా తొక్కుకుంటూ పోతం. మహబూబాబాద్ ఎంపీగా బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించండి.' అని రేవంత్ పిలుపునిచ్చారు.


Also Read: Indiramma Housing Scheme: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వారికి రూ.6 లక్షల ఆర్థిక సాయం, డిప్యూటీ సీఎం కీలక ప్రకటన