CM Revanth Reddy Responds on Kavitha Arrest: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS Mlc Kavitha) ఈడీ అరెస్టు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఇది ఎన్నికల స్టంట్ అంటూ ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తన కుమార్తె కవిత అరెస్టుపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజాపాలనకు వంద రోజులు పూర్తి కానున్న నేపథ్యంలో మంత్రులతో కలిసి ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. 'కవిత అరెస్టును కేసీఆర్ ఎందుకు ఖండించలేదు.?. కేసీఆర్, ప్రధాని మోదీ మౌనం వెనుక వ్యూహం ఏంటి.? గతంలో ఈడీ వచ్చాక మోదీ వచ్చేవారు. అయితే, శుక్రవారం మోదీ, ఈడీ కలిసే వచ్చారు. కేసీఆర్ కుటుంబం, బీజేపీ మద్యం కుంభకోణాన్ని ధారావాహికలా నడిపించారు. కవిత అరెస్ట్ బీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామా. ఎన్నికల షెడ్యూల్ కు ఒక రోజు ముందే జరిగిన ఈ పరిణామాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కలిసి చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. ఈ అరెస్ట్ ఎన్నికల స్టంట్. తెలంగాణకు ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదు. ఆయనకు ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు.' అని రేవంత్ పేర్కొన్నారు.


వంద రోజుల పాలనపై..


కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలన సంతృప్తి ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 'మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లామని.. ప్రస్తుతం తాము ప్రజల్లోనే ఉన్నామని చెప్పారు. 'ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేలా ప్రజావాణిని అమలు చేస్తున్నాం. అధికారం చేపట్టిన 24 గంటల్లోనే 2 హామీలు అమలు చేశాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు పథకాలనూ ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నాం. 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. బీఆర్ఎస్ హయాంలో అవినీతికి అడ్డాగా మారిన టీఎస్ పీఎస్సీని.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రక్షాళన చేపట్టాం. ఆరు గ్యారెంటీల అమలే లక్ష్యంగా పని చేస్తున్నాం. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నాం. పన్ను ఎగవేతదారులపై కఠినంగా వ్యవహరించి.. ఆదాయాన్ని స్థిరీకరించాం. గతంలో సీఎం దర్శనమే భాగ్యం అన్నట్లుగా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.' అని రేవంత్ పేర్కొన్నారు.


'చేయాల్సింది చాలా ఉంది'


వంద రోజుల్లో చాలా చేశామని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం రేవంత్ అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం వందేళ్లకు సరిపడా విధ్వంసం చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారని మండిపడ్డారు. 'ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి.. సచివాలయంలోకి సాధారణ ప్రజలు వచ్చేందుకు స్వేచ్ఛ ఇచ్చాం. భేషజాలకు పోకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర హక్కుగా రావాల్సిన వాటిని రాబట్టగలిగాం. హంగులు లేకుండా పాలన సాగుతోంది. వైబ్రెంట్ తెలంగాణ 2050తో ముందుకు వెళ్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే బీఆర్ఎస్ లో ఎవ్వరూ మిగలరు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం.' అని రేవంత్ స్పష్టం చేశారు.


Also Read: Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్ - 7 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి