CM Reavanth Key Orders on Drinking Water And Current: వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని.. అలాగే, కరెంట్ కోతలు సైతం లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. శనివారం తాగునీటి సరఫరా, కరెంట్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా ఉండాలని.. ఇందుకోసం తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గతేడాది కంటే రాష్ట్రంలో ఈసారి అత్యధికంగా విద్యుత్ సరఫరా చేయటం కొత్త రికార్డును నమోదు చేసిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని.. పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్ అందించటంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని సీఎం ప్రశంసించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
గతేడాదితో పోలిస్తే..
గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సగటున 9,712 మెగావాట్ల విద్యుత్ లోడ్ ఉంటుంది. గత రెండు వారాలుగా 14,000 మెగా వాట్ల నుంచి 15,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉంటోంది. ఏప్రిల్ నెల రెండో వారం వరకు ఇంచుమించుగా ఇదే స్థాయిలో డిమాండ్ ఉంటుందని విద్యుత్ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో అవసరాలకు తగిన విధంగా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. తాగునీటికి ఇబ్బంది లేకుండా, పంటలు ఎండిపోకుండా, పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పారు.
కొత్త రికార్డు
కాగా, గతేడాది జనవరి నుంచి మార్చి వరకు సగటున రోజుకు 239.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. 2024 జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలల్లో రోజుకు సగటున 251.59 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరిగింది. గతేడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్లు సరఫరా అత్యధిక రికార్డు కాగా.. ఈ ఏడాది 308.54 మిలియన్ యూనిట్లతో కొత్త రికార్డు నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ సరఫరా మెరుగుపడింది.
తాగునీటి సమస్యపై
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. 'ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులు ఉపయోగించుకోవాలి. బోర్ వెల్స్, బావులన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలి. సమీపంలో ఉన్న నీటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలి. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలి. ప్రత్యేకంగా గ్రామాల వారీగా డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. అవసరాన్ని బట్టి రాష్ట్ర స్థాయి నుంచి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు వాటర్ ట్యాంకులు అందుబాటులో ఉండేలా చూడాలి. ట్యాంకర్లు బుక్ చేస్తే ఆలస్యం లేకుండా 12 గంటల్లోపు అవసరమైన చోటికి చేరేలా చర్యలు చేపట్టాలి. అందుకు సరిపడినన్న ట్యాంకర్లు సమకూర్చుకోవాలి.' అని సీఎం అధికారులకు నిర్దేశించారు.
Also Read: Revanth met Keshav Rao: కేశవరావు నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌లో చేరికపై చర్చలు