Cm Revanth Reddy Holi Celebrations With Grandson: తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఇటు తెలంగాణలో రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు, సామాన్యులు సందడిగా సంబరాల్లో మునిగి తేలారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ లోని తన నివాసంలో కుటుంబంతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. భార్య గీతారెడ్డితో కలిసి తన మనవడు రేయాన్స్ పై రంగులు చల్లుతూ సందడి చేశారు. రంగులు పూస్తుండగా చిరునవ్వులు చిందిస్తున్న మనవడి సరదా చూసి మురిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. 'పరిపాలన, రాజకీయ, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు, తీరిక లేని షెడ్యూల్ అన్నింటికీ కొంచెం విరామం. హోలీ పండుగ రోజు.. మనవడితో ఆటవిడుపు' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.






రాజకీయ నేతల హోలీ సంబరాలు


కాంగ్రెస్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కొల్లాపూర్‌లో బైక్‌పై తిరుగుతూ వ్యాపారస్తులకు, ప్రజలకు రంగులు  పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కూడా మంత్రి జూపల్లికి రంగులు పూశారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగయ్య పల్లి తండాలో ఎమ్మెల్యే బిర్లా  ఐలయ్య గిరిజనులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.  హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా హోలీ సంబరాల్లో పాలుపంచుకున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఫుల్‌ జోష్‌లో కనిపించారు. వరంగల్‌ వెస్ట్‌ ఎమ్మెల్యే నాయిని రాజేంద్రనాధ్‌ ఆఫీసులు హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులతో కలిసి పండుగ చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.


సంబరాల్లో మునిగి తేలిన బండి సంజయ్‌


కరీంనగర్‌లోనూ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ చిన్నారులతో ఆడుతూ... పెద్దలకు రంగులు పూస్తూ.. హోలీ సంబరాల్లో మునిగితేలారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో కలిసి పండుగ చేసుకున్నారు. ఆదివారం ఉదయమే బండి సంజయ్‌ ఇంటి దగ్గరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు చేరుకున్నారు. ఆయనకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బైక్‌పై గల్లీ గల్లీ తిరుగుతూ కనిపించిన వారిందరికీ రంగులు పూశారు. దారిలో కన్పించిన  పారిశుధ్య కార్మికులకు కూడా రంగులు పూసి ఆప్యాయంగా పలకరించారు. వారందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల దగ్గరకు వెళ్లి రంగులు పూశారు. అటు, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లోనూ ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. 


Also Read: Health cards in TG: తెలంగాణలో ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డ్‌- మంత్రి శ్రీధర్‌బాబు