Gangs of Godavari 'Motha': మాస్ కా దాస్ విశ్వక్‌ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’. డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం.. సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచింది. ఇందులో భాగంగా ఈరోజు హోళీ పండుగను పురస్కరించుకొని తాజాగా 'మోత' అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.


"కొవ్వూరు ఏరియాలో ఎవరూ కట్టని సీర కట్టి.. కడియంపు లంక పరిసరాల్లో ఎవరూ పెట్టని పూలు పెట్టి.." అంటూ సాగిన ఈ పాట మాస్ ని ఆకట్టుకునేలా ఉంది. యువన్ శంకర్ రాజా తనదైన శైలిలో మాస్ ని మెప్పించేలా ఈ సాంగ్ ను కంపోజ్ చేశారు. ఒకరకంగా ఇది చాలా గ్యాప్ తర్వాత లిటిల్ మాస్ట్రో స్వరపరిచిన మాస్ సాంగ్ అని చెప్పొచ్చు. ట్యూన్ వింటుంటే ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా రిలీజైన తర్వాత, థియేటర్లలో మోత మోగించడం ఖాయం అనేలా ఉంది.


'మోత' సాంగ్ లో విశ్వక్ సేన్‌ తో కలిసి హిందీ బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఖాన్ ఆడిపాడింది. అందాల తార అయేషా స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ డ్యాన్సులు సినీ ప్రియులకు స్పెషల్ ట్రీట్ లా మారబోతోంది. విశ్వక్ సైతం ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. కల్లు కాంపౌండ్ సెటప్ లో చిత్రీకరించిన ఈ సాంగ్ విజువల్ గానూ బాగుంది. విశ్వక్, అయేషా ఇద్దరూ పాటకు తగ్గ కాస్ట్యూమ్స్ లో కనిపించారు. ఒకరికొకరు పోటీపడి డ్యాన్స్ చేశారు.



'మోత' పాటకు ప్రముఖ గీత రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ లిరిక్స్ రాశారు. పాట సందర్భానికి తగ్గట్టుగా పదాల అల్లికతో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక ప్రత్యేక గీతాల స్పెషలిస్ట్ సింగర్ ఎం.ఎం. మానసి మరోసారి తన గాత్రంతో మ్యాజిక్ రిపీట్ చేసింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ స్టెప్పులు ఊపు తెప్పిస్తున్నాయి. మొత్తం మీద రంగుల పండుగ సందర్భంగా విడుదలయిన ఈ పాట పండగ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చిందని చెప్పాలి. 


'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి వెంకట్ ఉప్పుటూరి, గోపీ చంద్ ఇన్నమూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనిత్ మధాడి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గాంధీ నడికుడికార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.


కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలో మాస్ ని మెప్పించే గ్యాంగ్‌ స్టర్ పాత్రలో అలరించడానికి రెడీ అవుతున్నారు. చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఓ వ్యక్తి ప్రయాణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. 2024 మే 17న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read: సమ్మర్‌లో చిన్న, మీడియం రేంజ్ హీరోల సందడి - మండుటెండల్లో హిట్టు కొట్టేదెవరో?