CM Reavanth And Ministers Visited Medigadda: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం మేడిగడ్డ (Medigadda) చేరుకుంది. బ్యారేజీ వద్ద కుంగిన పిల్లర్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నేతలు ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. ప్రాజెక్టు పరిశీలన సందర్భంగా ప్రజా ప్రతినిధుల బృందం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వంతెనను పూర్తిగా పరిశీలించిన అనంతరం దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అధికారులు ఇవ్వనున్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ స్వల్ప కాలిక చర్చ అనంతరం సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, అధికారుల బృందం మేడిగడ్డకు ప్రత్యేక బస్సుల్లో వచ్చారు.


సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్






తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఆయన.. బీఆర్ఎస్ అధినేతను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. 'రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి.. 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై  కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులకు పనికి రాదు. పూర్తిగా పునఃనిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. కానీ, బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదు. అన్నీ పార్టీల శాసనసభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జల దృశ్యాన్ని కళ్లారా చూడబోతోంది.' అని ట్వీట్ లో పేర్కొన్నారు.


Also Read: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితతో జగిత్యాల బీఆర్ఎస్ కౌన్సిలర్ల భేటీ, అవిశ్వాసంపై వెనక్కి!