ఒకప్పుడు సిరిసిల్ల ప్రాంతాన్ని చూస్తే కన్నీళ్లు వచ్చేవని, సమైక్య రాష్ట్రంలో ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడు ఎలాంటి సమస్యలు లేవని సీఎం కేసీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ఆయన ప్రసంగించారు. తొమ్మిదినరేళ్లలో తెలంగాణను ఎన్నో అంశాల్లో నెంబర్ వన్ గా నిలిపామని, 'మాది చేతల, చేనేతల ప్రభుత్వం' అని పేర్కొన్నారు. సిరిసిల్ల మంచి విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందన్న కేసీఆర్, 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు.
100 సార్లు తిరిగాను
తన 70 ఏళ్ల జీవితంలో సిరిసిల్లలో కనీసం వంద సార్లు తిరిగినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చూస్తే బాధగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అప్పర్ మానేరులో ఏడాదంతా నీరు ఉంటోందని చెప్పారు. సమైక్య పాలనలో మొత్తం నాశనమైందని ఈ ప్రాంతమంతా దుమ్ము లేచే పరిస్థితి ఉండేదని విమర్శించారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తే ఆదరించి గెలిపించారని, కానీ అప్పట్లో ఏడుగురు చేనేత కార్మికుల ఆత్మహత్య చేసుకోవడంతో ఎంతో చలించిపోయానని చెప్పారు. పార్టీ నిధులు, చందాలు సేకరించి వారికి సాయం చేసినట్లు గుర్తు చేశారు. కేటీఆర్ చేనేత శాఖ మంత్రి అయిన తర్వాత సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయని కేసీఆర్ ప్రశంసించారు.
బతుకమ్మ చీరలపైనా రాజకీయం
సిరిసిల్లను షోలాపూర్ లా చేయాలనేదే మా ప్రయత్నమని సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభలో వెల్లడించారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే బతుకమ్మ చీరల పంపిణీ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. చివరకు ఆ పథకాన్ని కూడా రాజకీయం చేశారని అన్నారు. నచ్చకపోతే చీరలు తీసుకోవద్దని, చీరల పంపిణీని కూడా రాజకీయం చెయ్యొద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు.
'ధరణి'పై మీరే తేల్చుకోండి
కాంగ్రెస్ నేతలు 'ధరణి'పై విమర్శలు చేస్తున్నారని, అది రద్దైతే వీఆర్వోలు మళ్లీ పెత్తనం చేస్తారని, రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సీఎం కేసీఆర్ వివరించారు. ధరణి వల్లే పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ధరణి ఉంచాలో.? వద్దో.? రైతులే తేల్చుకోవాలని సూచించారు. విపక్షాలతో పెను ప్రమాదం పొంచి ఉందని, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతు బంధు వంటి పథకాలు లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
వారు కరెంట్ ఇవ్వలేదు
తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిపామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ వద్దని కాంగ్రెస్ నేతలు చెప్పారని గుర్తు చేశారు. 3 గంటల కరెంట్ కావాలో.? 24 గంటల కరెంట్ కావాలో.? తేల్చుకోవాలన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ సరిపడా కరెంట్ ఇవ్వలేదని అన్నారు.
కాగా, కేసీఆర్ సీఎం అయిన తర్వాత సిరిసిల్ల నేతన్నల జీవితాలు మారాయని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ అభివృద్ధి సాధించిందని వివరించారు. ప్రజా ఆశీర్వాద సభతో సిరిసిల్ల గులాబీ మయంగా మారింది.