ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ నెల 20న (శుక్రవారం) దీనిపై విచారిస్తామని సుప్రీం తెలిపింది. అంత వరకూ ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చెయ్యొద్దని సర్వోన్నత న్యాయస్థానం సీఐడీని ఆదేశించింది.
హైకోర్టులోనూ వాయిదా
మరోవైపు, స్కిల్ స్కాం కేసులోనూ చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో మంగళవారం విచారణ జరగ్గా, తదుపరి విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. అలాగే, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విచారించిన విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబు తరఫు లాయర్ల పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది.
ఇదీ ఫైబర్ నెట్ కేసు
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.321 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ టెండరును టెరాసాఫ్ట్ కంపెనీకి అప్పగించారని, ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఏపీ ఫైబర్ నెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ 2021లో సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది.
ములాఖత్ ల విషయంలోనూ
మరో వైపు, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబు లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. ఆయన ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడితోనే జైలు అధికారులు ఇలా చేసినట్లు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని, దీనిపై ఆయన నిత్యం న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు ములాఖత్ ల అంశంపై టీడీపీ ముఖ్య నేతలు జైళ్ల శాఖ డీఐజీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ములాఖత్ లు ఎప్పటిలానే ఉండేలా చూడాలని అభ్యర్థించారు.