Chandrababu Case : రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు  లీగల్ ములాఖత్‌లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్‌లను ఒకటికి కుదించారు. చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తమ నిర్ణయం ప్రకటన సందర్భంగా తెలిపారు.  పరిపాలనా కారణాలతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.      

  


జైలు అధికారుల నిర్ణయంపై టీడీపీ నేతల అసంతృప్తి                                   


తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి ఇచ్చే లీగల్ ములాఖత్‌లను కుదించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కేసుల్లో సరైన విధంగా న్యాయ పోరాటం చేయకుండా చూడడం కోసమే ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి లీగల్ ములాఖత్ పై ఆంక్షలు పెట్టిందని పార్టీ నేతలు ఆరోపించారు. 39 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబును రోజూ రెండు సార్లు తన అడ్వకేట్లు కలుస్తున్నారు. అయితే సోమవారం నుంచి రోజుకు ఒక్క సారి మాత్రమే ములాఖత్ ఉంటుందని అధికారుల తేల్చి చెప్పారు. 


న్యాయపోరాటం అంశంపై చంద్రబాబును కలుస్తున్న లాయర్లు                                     


చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని....వీటిపై పోరాటం కోసం ఆయన నిత్యం న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.  ప్రభుత్వం లీగల్ ములాఖత్ లను తగ్గించడం ద్వారా లీగల్ ఫైట్‌లో చంద్రబాబు ముందుకు వెళ్లకుండా చూడాలన్న కుట్ర చేసిందని నేతలు ఆరోపించారు. లీగల్ ములాఖత్‌ల విషయంలో ఆంక్షలు తొలగించి... రోజుకు రెండు సార్లు ములాఖత్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.  టీడీపీ ముఖ్యనేతలు, ఇన్‌చార్జిలు మంగళవారం జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు.                             


స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా                                     
 
స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో  చంద్రబాబు  బెయిల్ పిటిషన్‌‌పై  విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా పడింది. బాబు తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్ట్ విచారణను వాయిదా వేసింది. తిరిగి 19న పూర్తి స్థాయిలో వాదనలు వినే అవకాశం ఉంది.