KCR Maharashtra Tour: మహారాష్ట్రకు రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం (జూన్ 26) సోలాపూర్‌కు చేరుకున్నారు. రేపు సీఎం పండరీపురం, ధారాశివ్ జిల్లాలోని తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ శక్తిపీఠం కొలువై ఉంది. నేడు రాత్రి కేసీఆర్ సహా వెంట వెళ్లిన నేతలు అందరూ సోలాపూర్ లోనే బస చేయనున్నారు. నేడు ఉదయం రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ బయలుదేరిన సంగతి తెలిసిందే.
దాదాపు 600 కార్లు, రెండు బస్సులతో ర్యాలీ తరహాలో కేసీఆర్ మహారాష్ట్రకు తరలివెళ్లారు. మధ్యాహ్నం దారి మధ్యలో ధారాశివ్ జిల్లా ఒమర్గాలో లంచ్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. అక్కడ ఈ మధ్య బీఆర్‌ఎస్ లో చేరిన స్థానిక నేతలు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.
రేపటి షెడ్యూల్ ఇదీ
రేపు మంగళవారం (జూన్ 27) ఉదయం 8 గంటలకే సీఎం కేసీఆర్ పండరీపురానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ రుక్మిణీ సమేత విఠలశ్వరస్వామివారి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన పార్టీ సంబంధిత కార్యక్రమానికి హాజరు అవుతారు. సోలాపూర్ జిల్లా నేత, ఎన్సీపీకి చెందిన భగీరథ్ బాల్కే సహా పలువురు నాయకులు సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో రేపు మధ్యాహ్నం చేరనున్నారు. ఈ సందర్భంగానే కేసీఆర్ ప్రసంగిస్తారు.
అక్కడే భోజనాలు ముగించుకొని.. మధ్యాహ్నం 1.30 గంటలకు ధారాశివ్ జిల్లాలో కొలువుదీరిన శక్తిపీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు. సుమారు 3.30 గంటలకు అక్కడ ప్రత్యేక పూజలు చేయించి, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌కు రోడ్డు మార్గంలోనే తిరుగు ప్రయాణం అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు ఆ ఆలయం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు ప్రగతి భవన్‌కు చేరతారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే 4 సార్లు మహారాష్ట్రలో పర్యటన
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన నాటి నుంచి ఇప్పటికి 4 సార్లు మహారాష్ట్రలో పర్యటించారు. తొలుత ఫిబ్రవరి 5న నాందేడ్‌లో భారీ బహిరంగ సభ, మార్చి 14న కంధహార్ బహిరంగ సభ నిర్వహించారు. మే 19న మరోసారి నాందేడ్ లో పర్యటించారు. అక్కడ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ తరహా అభివృద్ధి మహారాష్ట్రలో ఎందుకు జరగదని ప్రజలు ఆలోచించేలా అక్కడి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇటీవల జూన్ 15న నాగ్‌పుర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. త్వరలో ఔరంగాబాద్, పుణెలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. తాజాగా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన ఐదోసారి అవుతుంది.
ఒక్క సీటు వచ్చినా రాజకీయాల నుంచి తప్పుకుంటా - ఠాక్రే
మహారాష్ట్రలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు వచ్చినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే అన్నారు. కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌తో ఒరిగేదేమీ లేదని అన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా మారిందని, భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండబోదని స్పష్టం చేశారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము అంతటిని మహారాష్ట్రలో ఖర్చు పెడుతున్నారని, ఇటీవల కర్ణాటక ఎన్నికలకు కూడా డబ్బులు పంపారని ఆరోపించారు.