కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఎన్నికపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రారంభించనున్న దళిత బంధు పథకం అంశంపై ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి తో సీఎం కేసీఆర్ ఫోన్లో సంభాషించారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామానికి చెందిన రాజేశానికి కేసీఆర్ ఫోన్ చేశారు. 


కేసీఆర్ ఫోన్ లో మాట్లాడుతూ.. 'దళిత బంధు పథకం అంశంపై చర్చించేందుకు ఈ నెల 26న ప్రగతిభవన్ లో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ సభకు రావాలి. ఈ పథకంపై నియోజకవర్గంలో అందరికీ తెలియజేయాలి. ప్రపంచంలోనే ఇది గొప్ప పథకం.' అని మాట్లాడారు. ఈ మాటల మధ్యలో రాజేశం ఈటల ప్రస్తావన తీసుకు రాగా.. 'ఈటల రాజేందర్ చాలా చిన్నోడు.. అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. అయ్యేది లేదు.. పొయ్యేది లేదు..' అని కేసీఆర్ అన్నారు. దళిత బంధు పథకం హుజరాబాద్ లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రమంతా వర్తింపజేస్తామని  ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ గా మారింది.


తెలంగాణ దళిత బంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. ఆ నియోజవర్గ పరిధిలోని దళితులతో ప్రగతి భవన్‌లో ఈ నెల 26న అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం సదస్సులో మాట్లాడతారు. ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, ప్రతీ మున్సిపాలిటీ నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు హాజ‌రుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ పథకం గురించి చర్చ జరగనుంది.


వారితో పాటు 15 మంది రిసోర్స్‌ పర్సన్స్‌ కూడా సమావేశానికి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దళిత బంధు అవగాహన సదస్సుకు హాజరయ్యే వారంతా ప్రత్యేక బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి వెళ్లనున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవనున్నారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై వారికి సీఎం కేసీఆర్ స్వయంగా అవగాహన  కల్పించనున్నట్టు తెలుస్తోంది.


 


Also Read: KTR BIRTHDAY : గులాబీ దళంలో ఈ ఉత్సాహం  పట్టాభిషేక సూచికేనా..!?


                 KTR Birthday: కేటీఆర్ చిన్నప్పుడు ఇలా ఉన్నారన్న మాట!