వెండితెరపై మరో క్రేజీ కాంబో సందడి చేయనుంది. ప్రభాస్, నాగాశ్విన్ కాంబినేషనే స్పెషల్ అనుకుంటే... చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. పాన్ ఇండియా సినిమాగా రెడీ అవుతున్న ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ కీ రోల్ ప్లే చేస్తున్నారని టాక్.
అమితాబచన్, ప్రభాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. ఈ సినిమా ప్రారంభోత్సవం రామోజీఫిల్మ్ సిటీలో ఉత్సాహంగా సాగింది. ప్రభాస్ తో పాటు సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సినిమాకు Project K (ప్రాజెక్ట్ కే) అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
ముహూర్తపు షాట్‌కి ప్రభాస్ క్లాప్ కొట్టారు. వచ్చే నెల రెండో తేదీ వరకు ఈ సినిమా షెడ్యూల్ ప్లాన్ చేశారు. ముందుగా అమితాబ్ బచ్చన్‌పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌కు గెటప్ టెస్ట్‌లు చేస్తున్నారని, ట్రైల్ షూట్ నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పుడు తీసే సన్నివేశాలు సినిమాలో కనిపించవు. ఇది కేవలం ట్రైల్ షూట్ మాత్రమే. అయితే ఈ షాట్స్ ని ప్రచార చిత్రాల్లో ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలంతా ఒకటి లేదా రెండు సినిమాల్లో నటిస్తుంటే.. ప్రభాస్ మాత్రం ఏకంగా నాలుగు సినిమాలు చేస్తున్నాడు. పెండింగ్‌లో ఉన్న నాగాశ్విన్ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు.. అంతకు మించి ఉంటుందని నాగ్ అశ్విన్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి ఫ్యాన్స్ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చూశారు. తాజాగా ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది.
ఇదో విచిత్రమైన జోనర్ కి చెందిన కథ అని, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ రెండూ మిళితమై సాగుతాయని తెలుస్తోంది. దర్శకుడు నాగాశ్విన్ కి సినిమా స్క్రిప్ట్ రాసుకోవడంలో ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు సాయం చేశారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'సలార్', ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' సినిమాలు చేస్తున్నాడు. వీటి కంటే ముందు చాలా కాలంగా 'రాధేశ్యామ్' కోసం పని చేస్తున్నాడు. కానీ ఇంకా సినిమా పూర్తి కాలేదు. ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న ఓ పాట చిత్రీకరిస్తున్నారని సమాచారం. పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రంగా సినిమాను రూపొందిస్తున్నారు. నిజానికి ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కావాలి మరేం జరుగుతుందో చూడాలి!