వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను ఎర్రగంగిరెడ్డి బెదిరించారని ..వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగయ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.  జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ముందు ఆయన శుక్రవారం వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయంపై మీడియా రకరకాల కథనాలు వేస్తోంది. అసలు ఈ ఎర్ర గంగిరెడ్డి ఎవరు..? తన పేరు చెప్పవద్దని ఎందుకు వాచ్‌మెన్ రంగయ్యను బెదిరించారు..? అన్న  సందేహాలు చాలా మందిలో ప్రారంభమయ్యాయి. 


వివేకా రైట్ హ్యాండ్ ఎర్రగంగిరెడ్డి..!


ఎర్ర గంగిరెడ్డి సొంతూరు కడప జిల్లా తొండూరు మండలం తేలూరు. గత 30 ఏళ్లుగా వివేకానందరెడ్డి, వైఎస్‌ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. ముఖ్యంగా వైఎస్ వివేకాకు ఆయన ప్రాణమిత్రుడు లాంటి వారు.  వివేకాతో పాటే ఎప్పుడూ కనిపించేవారు. ఎర్ర గంగిరెడ్డి అవివాహితుడు. నూనె వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగారు. ఈ క్రమంలో వివేకాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రాజకీయంగానూ ఎదుగుదల ప్రారంభమైంది. ఇప్పటికి కూడా వివేక తనకు దేవుడని ఆయన చెబుతుంటారు. ఆయనను హత్య చేయాల్సిన అవసరం కానీ.. హత్య చేయించడానికి ప్లాన్ చేయాల్సిన అవసరం కానీ లేదని చెబుతున్నారు. రంగయ్యతో అసలు పరిచయమే లేదని.. వాచ్‌మెన్‌గా చూశాను తప్ప.. ఎప్పుడూ మాట్లాడలేదని వివిధ ఛానల్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పష్టం చేస్తున్నారు.


హత్య విషయం తెలిసీ సాక్ష్యాలు తుడిచేసిన ఎర్ర గంగిరెడ్డి..!


అయితే ఎర్ర గంగిరెడ్డి వ్యవహారం అంతా అనుమానాస్పదంగా ఉంటుందన్నది మరికొందరి వాదన. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు ఆయనతోపాటే ఉన్నానని గంగిరెడ్డి చెబుతున్నారు. జమ్మలమడుగులో పర్యటించి ఇంటికి వచ్చామని.. తన ఇంటి దగ్గర వివేకా తమను దిగబెట్టి వెళ్లారని..  ఉదయమే.. వివేకా పీఏ హత్య జరిగినట్లుగా తనకు ఫోన్‌లో చెప్పారని గంగిరెడ్డి చెబుతున్నారు. కానీ..  ఆయనే సాక్ష్యాల తుడిచివేశారని ప్రచారం జరుగుతోంది. హత్య జరిగిన రోజున వివేకా పీఏ కృష్ణారెడ్డి..  వైఎస్ కుటుంబసభ్యులతోపాటు.. ఎర్రగంగిరెడ్డికి కూడా సమాచారం ఇచ్చారు. సాక్ష్యాల తారుమారు వ్యవహారంలో గంగిరెడ్డినే ప్రధాన అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్టు చేశారు.


తనకే పాపం తెలియదంటున్న గంగిరెడ్డి..!


వివేకా తనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ఎర్ర గంగిరెడ్డి చెబుతున్నారు. అయితే ఆయన హత్యకు గురైన విషయం  తెలిసి కూడా బయటకు చెప్పలేదు. పైగా సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆయనది గుండెపోటు అని నమ్మించే ప్రయత్నంలోనూ భాగస్వామిగా ఉన్నాడని విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే ఆయనపై అనేక మంది అనుమానపడుతున్నారు. చివరికి.. వైఎస్ వివేకా కుమార్తె సునీత కూడా.. తాము హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో ఎర్రగంగిరెడ్డి పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పుడు వాచ్‌మెన్ రంగయ్య... ఎర్రగంగిరెడ్డి తన గురించి చెప్పవద్దని బెదిరించినట్లుగా వాంగ్మూలం ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. దీంతో కేసు ఎలాంటి మలుపులు తిరగబోతోందనన్న ఆసక్తి నెలకొంది.