మూడు రోజులుగా ఎడ తెరిపిలేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల  విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు, ఎల్లుండి (జూలై 21, 22) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. అత్యవసర సేవలు అయిన వైద్యం, పాల సరఫరా లాంటివి కొనసాగుతాయని సీఎం తెలిపారు. అదే సందర్భంలో ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.


స్కూళ్లకి కూడా సెలవులు


మూడు రోజులుగా ఎడ తెరిపిలేని వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల విద్యాసంస్థలకు కూడా సెలవులను పొడిగించారు. రేపు, ఎల్లుండి (జూలై 21, 22) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి ఆదేశించారు.


భారీగా ట్రాఫిక్ జామ్


ఇప్పటికే వర్షాల వల్ల వివిధ పనుల కోసం బయటికి లేదా ఆఫీసులకు కార్యాలయాలకు వెళ్లే ప్రజలు హైదరాబాద్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైక్ లపై, ప్రజా రవాణాలో వెళ్లే వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వర్షానికి తడుస్తూ వారి వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. మాదాపూర్‌, గచ్చిబౌలిలో రోడ్లపై నీళ్లు జమ కావడం వల్ల నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతోంది. దీనివల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రాయదుర్గం, కొండాపూర్‌లో వాహనాల రాకపోకలు బాగా స్తంభించాయి. ట్రాఫిక్‌ జామ్‌పై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఫైర్ అవుతున్నారు.


సీఎస్ అత్యవసర సమీక్ష


వర్షాలపై హైదరాబాద్‌లో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులతో చర్చించారు. రానున్న 48 గంటల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఆయా జిల్లాల్లోని వివిధ అధికారులతో సమన్వయం చేసుకొని పరిస్థితులను ఎదుర్కొని ఎందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.


ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం


ఉమ్మడి మెదక్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని దానితోపాటు దక్షిణ తెలంగాణలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎస్ తెలిపారు. వరంగల్, ములుగు, కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మొహరించినట్లు చెప్పారు. అత్యవసర సమయంలో వారికి సహాయం అందించడానికి మరో 40 మందితో బృందాలను హైదరాబాదులో సిద్ధం చేసినట్లు చెప్పారు.


ఎలాంటి నష్టం లేదు


వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని రోడ్లు, చెరువులు, కుంటలకు ఎటువంటి నష్టం జరగలేదని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పరిస్థితి మెరుగ్గా ఉందని సీఎస్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 50% నీరు ఉందని భారీ వర్షాలు వరదలతో ఇప్పటివరకు ఎటువంటి సమస్య లేదని సిఎస్ పేర్కొన్నారు.