Mallanna Sagar Inaguration: మల్లన్న సాగర్ నిర్మాణం కావడం చారిత్రకమని, ఈ మహా యజ్ఞంలో పని చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తెలిపారు. ఒక దశలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఈ కొన నుంచి ఆ కొన వరకూ ఒకే సారి 58 వేల మంది కార్మికులు పని చేశారని గుర్తు చేశారు. అలాంటి సమయంలో ఓ దుర్మార్గుడు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చాడని చెప్పారు. ఆ స్టే తేవడం వల్ల వారంతా 14 రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా చెదిరిపోతే మళ్లీ వారిని కూడగట్టేందుకు ఏడాది సమయం పట్టిందని అన్నారు. తెలంగాణ ప్రజల జీవనాడి అయిన ఈ ప్రాజెక్టును ఆపవద్దని న్యాయనిపుణులను కోరానని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ఆపేందుకు దాదాపు 600కు పైగా కేసులు దాఖలయ్యాయని అన్నారు. విశ్రాంత నీటిపారుదల అధికారులు, ఇంజినీర్లు వయసు పైబడిన సమయంలో కూడా తెలంగాణ కోసం పని చేశారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఆయన బుధవారం (ఫిబ్రవరి 23) ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.


‘‘ప్రగతి నిరోధక శక్తులు, కిరికిరిగాళ్లు ప్రాజెక్టును ఆపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. గోదావరి నీళ్లతో కొమురవెల్లి మల్లన్న కాళ్లు కడుగుతామని అప్పుడే చెప్పా. ఈ కార్యక్రమం తర్వాత 5 కలశాల్లో గోదారి నీళ్లు తీసుకెళ్లి ఆ మొక్కు తీర్చుకోబోతున్నా. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అప్పటి నీటి పారుదల మంత్రి హరీశ్ రావు కూడా ఎంతో కష్టపడ్డాడు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ 100 శాతం అవినీతి రహితంగా కాళేశ్వరం నిర్మించాం. ఇది మల్లన్నసాగరం కాదు.. తెలంగాణ జన హృదయ సాగరం. ఇది హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా మంచినీటి సమస్య తీర్చే జల సాగరం. 20 లక్షల ఎకరాలను కడుపులో పెట్టుకొని కాపాడే ప్రాజెక్టు ఇది. 


పోతే ఇంకో 100 కోట్లు పోతయ్.. అదేం విషయం కాదు
‘‘ప్రాజెక్టులు కట్టినప్పుడు కొన్ని గ్రామాలు మునుగుతయ్. గాలిలో కట్టడం సాధ్యం కాదు. ఈ మల్లన్న సాగర్ (Mallanna Sagar Reservoir) కోసం కూడా ఎన్నో గ్రామాలు మునిగినయ్. రూ.లక్ష కోట్ల విలువైన కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితుల కోసం ఎవరూ ఇవ్వలేని పరిహారం ఇచ్చేలా జీవో ఇచ్చాం. మిగిలిన ముంపు పరిహార బాధితులు ఎవరన్నా ఉంటే వారిని కూడా ఆదుకోవాలని ఆదేశించా. పోతే ఇంకో 100 కోట్లు పోతయ్. అదేం పెద్ద విషయం కాదు. తెలంగాణ తెచ్చి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా తెచ్చి ఈ ప్రాంతం వారికి అన్యాయం జరగాలని నేను కోరుకోను. తప్పకుండా రీహాబిలిటేషన్ కాలనీలను కట్టాం. 


మల్లన్నసాగర్ లాంటి రిజర్వాయర్‌లు పాలమూరు జిల్లాలో కూడా త్వరలో సిద్ధం కాబోతున్నాయి. కరవు వచ్చినా పుష్కలంగా నీళ్లు లభించే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. దేశమంతా కరవు ఉన్నా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మాత్రం కరవు రాదు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం మల్లన్నసాగర్‌ను తొలిసారి నింపేందుకు మూడేళ్లు పడుతుంది. 


‘‘దిక్కుమాలిన సోషల్ మీడియాలో పనికిమాలిన పోస్టులు పెడుతున్నారు. దరిద్రపు గాడిదలు ఎక్కడికెల్లి వచ్చిన్రు అనుకున్నా. తెలంగాణలో ఉన్న ప్రతిపక్షాలు ఆలోచించాలి. ఏడేళ్ల క్రితం తెలంగాణ ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? పక్క రాష్ట్రాలతో పోల్చుకోండి. ఇవన్నీ మీరు గుర్తించాలి. కేంద్రం ఎలాంటి సహకారం ఇవ్వకపోయినా మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ పర్యటనకు వస్తానన్నరు. మీరు అన్ని పథకాలు ఎలా అమలు చేస్తున్నరు.. అని ఆశ్చర్యపోయాడు. ఆయన అలా అనేసరికి మా ఎమ్మెల్యేల ఎద ఉప్పొంగింది.’’


దేశం దారి తప్పుతోంది
‘‘దేశం మొత్తం దారితప్పి పోతాంది. ఈ దేశాన్ని చెడిపోనివ్వద్దు. దుర్మార్గమైన, జుగుప్సాకరమైన పనులు ఈ దేశంలో జరుగుతున్నాయి. బెంగళూరులో మతకల్లోలం రేపారు. అక్కడికి పోవాలంటే అంతా భయపడుతున్నారు. గతంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పని వల్ల బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అయింది. సెకండ్ ప్లేస్‌లో హైదరాబాద్ ఉంది. భారత దేశంలో అతి తక్కువ నిరుద్యోగం రేటు ఉన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే. బెంగళూరులో (Bengaluru Conflicts) జరిగేలాంటి కల్లోల పరిస్థితులు జరగడం చాలా దుర్మార్గం. దాన్ని సహించకూడదు. ప్రజలకు ఏది చేటో దాన్ని బండకేసి కొట్టాలి. నేను జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేలా ముందుకు సాగుతున్నాను. దేవుడు నాకిచ్చిన శక్తిని కూడదీసుకొని, చివరి రక్తపు బొట్టు వరకూ దేశాన్ని సక్రమ మార్గంలో పెట్టేందుకు పని చేస్తా’’ అని కేసీఆర్ ప్రసంగించారు.


ఈ బహిరంగ సభలో అంతకుముందు హరీశ్ రావు మాట్లాడుతూ.. మల్లన్న దేవుడు పుట్టినరోజైన బుధవారమే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం కాకతాళీయమని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని, ఈ ప్రాజెక్ట్ పూర్తి కాదంటూ చవాకులు పేల్చారని చెప్పారు. పట్టుదల ఉంటే కానిది ఏది ఉండదని కేసీఆర్ రుజువు చేశారని ప్రశంసించారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆపాలని హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్‌లో కలిపి వందల కేసులు వేశారని మంత్రి గుర్తుచేశారు. కానీ ఫిబ్రవరి 23, 2018న సుప్రీంకోర్టు అన్ని కేసులను కొట్టివేస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు అనుమతి ఇచ్చిందని హరీశ్ వెల్లడించారు.