తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటోందని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మరోసారి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని చిన్నచూపు చూడడం తగదని అన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయం ఎంపిక కావడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చిన తర్వాత సోమవారం సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగానే పర్యటకం విషయంలో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
‘‘తెలంగాణ చాలా గొప్ప సంస్కృతి, చరిత్ర కలబోత. 58 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణను ఎవరూ పట్టించుకోలేదు. అద్భుతమైన ప్రదేశాలు, జలపాతాలు, వారసత్వ సంపద తెలంగాణలో ఉంది. చారిత్రాక అవశేషాలు ఉన్న తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదు. వారసత్వంలో వచ్చిన పురాతన కోటలు, దోమకొండ కోట అప్పగిస్తామని చెబుతున్నారు. పద్మశ్రీ అవార్డుల కోసం జాబితాను పంపాలా? వద్దా? అని ప్రధాని మోదీ, అమిత్ షాను అడిగాను. పద్మశ్రీ అవార్డు వచ్చేవారు తెలంగాణలో లేరా అని అడిగాను.’’ అని కేసీఆర్ అన్నారు.
Also Read: TSRTC: మీరు సిటీ బస్ ఎక్కుతారా? అయితే గుడ్‌న్యూస్.. మీకు డబ్బు ఆదా.. సంస్థకు లాభం!
ఈ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడారు. హైదరాబాద్‌లో చెరువుల సుందరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుందరీకరణ, మురుగు కాల్వల మళ్లింపు చేపట్టామని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 185 చెరువులలో 127 చెరువులను గుర్తించి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో 48 చెరువులను ఇప్పటికే అభివృద్ధి చేశామని చెప్పారు.
Also Read: Huzurabad Bypoll : నిజామాబాద్ బాటలో హుజురాబాద్ ! ఎన్ని ఈవీఎంలు వాడాలో ?
‘‘ఈ పనుల కోసం రూ.407.3 కోట్లను మంజూరు చేశాం. ఇప్పటికే రూ.218 కోట్లు ఖర్చు చేశాం. రూ.94.17 కోట్ల అంచనా వ్యయంతో 63 చెరువుల సుందరీకరణను జీహెచ్ఎంసీ చేపట్టి 48 చెరువుల పనులను పూర్తి చేసింది. మిగతా 15 చెరువుల పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.30.50 కోట్లతో 45 చెరువుల అభివృద్ధి, వరద వల్ల దెబ్బతిన్న మరమ్మతులను జీహెచ్ఎంసీ చేపట్టిందని కేటీఆర్ తెలిపారు.
చెక్ డ్యాంలపై మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా నిర్మించే చెక్ డ్యాంలతో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. చెక్ డ్యాంలు, చెరువుల ఆధునీకరణతో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. చెక్‌డ్యాం నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చెక్ డ్యాంలు, చెరువుల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని హరీశ్ రావు తెలిపారు.
Also Read: దసరాకి ప్రైవేటు ట్రావెల్స్ బాదుడు.. ప్రత్యేక వడ్డన, ప్రత్యేక సర్వీసులు అంటున్న ప్రభుత్వాలు