తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా, ఈసారి ఉత్సవాలు వైభవంగా ప్రభుత్వం నిర్వహించనుంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ కీర్తి చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ తరహాలో 21 రోజుల పాటు ఉత్సవాలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు ఈ సంబురాలు జరుగుతాయని చెప్పారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల గురించి శనివారం (మే 13) సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 


సమావేశంలో నిర్ణయించిన ప్రకారం.. డాక్టర్ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో మొదటిరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు. అదే రోజు మంత్రులు వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


అమరవీరుల స్తూపాలను అలంకరించాలి - సీఎం


‘‘తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని 2023 జూన్‌ 2 నాటికి 9 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ వ్యవధిలో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో సమష్ఠి కృషితో తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తుంది. తెలంగాణ దేశానికే ఒక రోల్‌ మోడల్‌గా అయింది. మహారాష్ట్రతోపాటు ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతున్నారు. తెలంగాణ అమరులను స్మరించుకునేందుకు ఒక రోజును ప్రత్యేకంగా.. అమరుల దినోత్సవాన్ని జరుపుకోవాలి. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్తూపాలను పుష్పాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించి నివాళులర్పించాలి. అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు అధికారికంగా గౌరవ వందనం చేయాలి’’ అని సీఎం కేసీఆర్ సూచించారు.


మిగతా 20 రోజులలో రాష్ట్రంలోని వివిధ శాఖలు చూపిన ప్రగతిపై, ప్రభుత్వం పడిన కష్టాన్ని, దార్శనికతను, దృక్పథాన్ని విశ్లేషిస్తూ డాక్యుమెంట్ ను రూపొందించాలి. దీన్ని థియేటర్లు, టీవీలలో ప్రసారం చేయించాలి. తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి రాష్ట్రాన్ని సాధించిన దాకా సాగిన ఉద్యమ చరిత్రను తెలియజేసేలా మరో డాక్యుమెంటరీని రూపొందించాలి. ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద తదితర కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. చారిత్రక నిర్మాణాలను, ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించాలి. ప్రతిభ కనబరిచిన అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి అవార్డులు అందించాలి. సీఎస్‌ శాంతి కుమారి ఆధ్వర్యంలోని ఉత్సవాల కమిటీ, వేడుకల నిర్వహణపై ఉన్నత అధికారులతో చర్చించుకోవాలి’’అని సీఎం కేసీఆర్ సూచించారు.